'మనసంతా మీరే' అన్న ప్రేక్షకులు - Nostalgia

By iDream Post Oct. 19, 2020, 08:53 pm IST
'మనసంతా మీరే' అన్న ప్రేక్షకులు - Nostalgia

తెరకెక్కిన ప్రతి ప్రేమకథ విజయం సాధించదు. ప్రేక్షకుల హృదయాలను తడిమే భావోద్వేగాలు అందులో ఉండాలి. వెంటాడే సంగీతం తోడవ్వాలి. ఆరోగ్యకరమైన హాస్యం చేయూతనివ్వాలి. హీరో హీరోయిన్ మధ్య ఎమోషన్ ను ఆడియన్స్ సొంతం చేసుకోవాలి. అప్పుడే బ్రహ్మరథం దక్కుతుంది. అలాంటి మేటి సినిమాల్లో ఒకటి మనసంతా నువ్వే. 2001లో నిర్మాత ఎంఎస్ రాజు కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన దేవిపుత్రుడు ఊహించని విధంగా దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో పాటు తీవ్ర నష్టాలను మిగిల్చింది. శత్రువు, దేవి, పోలీస్ లాకప్ లాంటి బ్లాక్ బస్టర్ ద్వారా వచ్చిన డబ్బంతా ఆవిరైపోయింది. మళ్ళీ లేవాలి. తన సినిమా వల్ల దెబ్బ తిన్నవాళ్లంతా కోలుకోవాలి. ఆ సమయంలో ఓ పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా చూస్తుండగా వచ్చిన ఆలోచనే మనసంతా నువ్వే. పరుచూరి బ్రదర్స్ సహాయంతో కథ తయారు చేయించి విఎన్ ఆదిత్య అనే కొత్త కుర్రాడికి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పి పనులు మొదలుపెట్టారు.

చిత్రంలో జంటగా నటించి మెప్పించిన ఉదయ్ కిరణ్, రీమాసేన్ లను హీరోయిన్లుగా తీసుకున్నారు. సంగీతం చేసేందుకు ఆర్పి పట్నాయక్ సిద్ధమయ్యాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు. స్క్రిప్ట్ పక్కాగా ఫైనల్ అయ్యింది. లవ్, సెంటిమెంట్, కామెడీ, ఎమోషన్ ఏదీ మిస్ కాకుండా కమర్షియల్ అంశాలను అనవసరంగా చొప్పించకుండా అందమైన పెయింటింగ్ లాంటి సన్నివేశాలను కూర్చారు. జూన్ 1 నుంచి షూటింగ్ మొదలుపెట్టారు. బడ్జెట్ ఎక్కువ లేదు. స్టోరీ కూడా డిమాండ్ చేయడం లేదు. హైదరాబాద్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్విరామంగా పూర్తి చేశారు. కాంబో క్రేజ్ మీద బిజినెస్ ఆఫర్స్ బాగానే వచ్చినా తాడో పేడో తేల్చుకోవాలని ప్రాజెక్ట్ మీద నమ్మకంతో ఎంఎస్ రాజు స్వంతంగా రిలీజ్ చేసుకున్నారు.

అక్టోబర్ 19 మనసంతా నువ్వే విడుదలయ్యింది. కేవలం 1 కోటి ముప్పై లక్షలతో తీసిన సినిమా ఏకంగా 16 కోట్లకు పైగా వసూలు చేయడం చూసి అందరికి దిమ్మదిరిగిపోయింది. ఇది కదా రాజుగారు అనుకున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటల ఆడియో క్యాసెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఎక్కడ సాంగ్స్ కాంపిటీషన్ జరిగినా తూనీగా తూనీగా, చెప్పవే ప్రేమ లేకుండా ఎవరూ పాల్గొనడం లేదు. చిన్నప్పుడు విడిపోయిన చిన్ననాటి స్నేహితులు పెద్దయ్యాక అనూహ్యమైన పరిస్థితుల్లో కలుసుకోలేక పడే బాధను దర్శకుడు విఎన్ ఆదిత్య హృద్యంగా చిత్రీకరించారు. చంద్రమోహన్, సుధ, సునీల్, తనికెళ్ళ భరణి, పావలా శ్యామల తదితరులు పోటీపడీ మరీ పాత్రలకు జీవం పోశారు. లవ్ స్టోరీ అయినప్పటికీ కుటుంబాలు థియేటర్లకు పోటెత్తాయి. ఇప్పటికీ ఒక మంచి సినిమాగా మనసంతా నువ్వే స్థానం చెక్కుచెదరనిది. ఉదయ్ కిరణ్ మన మధ్య లేడనే చేదు నిజాన్ని భరిస్తూనే ఇలాంటి గొప్ప చిత్రాల్లో భాగమై ఎప్పటికీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడని ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా తలుచుకుంటాడు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp