మాయ చేసిన మాటల మన్మథుడు - Nostalgia

By iDream Post Dec. 20, 2020, 06:13 pm IST
మాయ చేసిన మాటల మన్మథుడు - Nostalgia

స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని లెక్కలను పాటించాల్సి ఉంటుంది. కమర్షియల్ సూత్రాలను అనుసరిస్తూ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తప్పనిసరిగా జోడించాల్సిన అంశాలు ఫాలో కాక తప్పదు. అలా కాకుండా ప్రయోగాలకు సిద్ధపడి రిస్క్ చేసే కథానాయకులు లేకపోలేదు. అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి నాగార్జున. 2002వ సంవత్సరం. 'నువ్వు వస్తావని' ఇండస్ట్రీ హిట్ తర్వాత క్యామియో చేసిన 'నిన్నే ప్రేమిస్తా' కూడా సక్సెస్ అయ్యింది. 'ఆజాద్' మంచి ప్రయత్నమే అయినప్పటికీ వసూళ్ల పరంగా అద్భుతాలు చేయలేదు. ఆపై వరసగా ఎదురులేని మనిషి, బావ నచ్చాడు, అధిపతి, ఆకాశవీధిలో, స్నేహమంటే ఇదేరా ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు. 'సంతోషం' ఒకటే ఊరట కలిగించినది. తన నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో క్లారిటీ వచ్చేసింది.

ఆ టైంలో కలిశాడు దర్శకుడు విజయ్ భాస్కర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ని వెంటబెట్టుకుని ఓ సింపుల్ లైన్ వినిపించాడు. తొలిప్రేమలో తనకు తెలియకుండా జరిగిన అపార్థం వల్ల అమ్మాయిలంటే ద్వేషం పెంచుకున్న హీరో జీవితంలోకి ఇంకో యువతి వచ్చి అతన్ని ఎలా మార్చుకుంటుందనేదే మన్మథుడు. నిజానికిది సీరియస్ లైన్. కానీ సెన్సిబుల్ హ్యూమర్ తోనే తన టైమింగ్ పవర్ చూపించే త్రివిక్రమ్ దీన్ని కూడా అదే తరహాలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ గా చెప్పాలని డిసైడ్ అయ్యాడు. మొదట కొన్ని సందేశాలు వెలిబుచ్చినా ఫైనల్ గా నాగార్జున ఓకే చెప్పాడు. స్వంత అన్నపూర్ణ బ్యానర్ మీదే నిర్మించేందుకు నిర్ణయం జరిగింది. సోనాలి బింద్రే మెయిన్ హీరోయిన్ గా ఫ్లాష్ బ్యాక్ కోసం అన్షు అనే కొత్తమ్మాయిని తీసుకున్నారు.

డిసెంబర్ 20న మన్మథుడు ఓ మోస్తరు అంచనాలతో విడుదలయ్యింది. ఇలాంటి సాఫ్ట్ టైటిల్ తో నాగ్ ఎలాంటి సినిమా చేసుంటాడా అని థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులను కడుపారా నవ్వుకునే వినోదాల విందు దొరికింది. ఎమోషన్ ని, కామెడీని ఇంత అద్భుతంగా బాలన్స్ చేస్తూ మెప్పించడంలో మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు విజయభాస్కర్-త్రివిక్రమ్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఆడియో సేల్స్ లో కొత్త రికార్డులు సృష్టించాయి. మాటలు తూటాల్లా పేలి ఆడియన్స్ తలుచుకుని మరీ నవ్వుకునేలా చేశాయి. ముఖ్యంగా విదేశాల్లో జరిగే బ్రహ్మానందం ట్రాక్ కోసమే మళ్ళీ మళ్ళీ చూసినవాళ్లు ఉన్నారు. భరణి, ధర్మవరపు, సుధ, చంద్రమోహన్, సునీల్ ఇలా అందరూ ఈ నవ్వుల యజ్ఞంలో పాలు పంచుకున్నారు. 18 ఏళ్ళు అవుతున్నా టీవీల్లో వచ్చిన ప్రతిసారి మన్మథుడు నిత్యనూతనంగా కనిపిస్తాడంటే దానికి ఎన్నో కారణాలు. ఇక్కడ చెప్పినవి కొన్నే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp