చరిత్ర సృష్టించిన 'ఇంద్ర' ప్రస్థానం - Nostalgia

By Ravindra Siraj Jul. 24, 2020, 04:21 pm IST
చరిత్ర సృష్టించిన 'ఇంద్ర' ప్రస్థానం - Nostalgia

(ఇంద్ర 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 2002లో యువకుడిగా ఉన్న ఓ అభిమాని జ్ఞాపకాలు)

రాయలసీమ ప్రాంతంలో ఆదోని అనే ఊరు. కర్నూలు జిల్లాలో కర్ణాటక బోర్డర్ కు దగ్గరగా ఉన్న ఒక చిన్న పట్టణం. అన్ని వసతులు ఉన్నట్టే అనిపిస్తాయి కానీ అభివృద్ధి పరంగా ఇంకా చాలా వెనుకబడి ఉన్న వాస్తవాన్ని ప్రతి వీధి గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒకప్పుడు సెకండ్ ముంబైగా పేరు గాంచిన ఆదోని బాబ్రీ మసీదు కూల్చివేత వల్ల రేగిన మత కల్లోలాల ప్రభావం తీవ్రంగా పడటంతో వైభవం కూడా తగ్గింది. కాని మనుషుల్లో విలువలు మాత్రం సజీవంగా ఉండటంతో ఐకమత్యానికి లోటు లేకుండా ఉండేది.నా బాల్యం నుంచి డిగ్రీ విద్యాభ్యాసం దాకా అన్ని అక్కడే నాకు. పదేళ్ల నుంచే నేను చిరుకి ఎలా ఫ్యాన్ అయ్యానో గుర్తు లేదు. అది వయసు పెరిగే కొద్దీ తగ్గలేదు కాని అంతకంతా పెరుగుతూ వచ్చింది.

తేదీ సరిగ్గా గుర్తులేదు. జూన్ నెల అనుకుంటా. ఇంద్ర ఆడియో రేపు విడుదల అవుతుందనంగా సరదాగా ఓ సారి షాప్ దాకా వెళ్లి క్యాసెట్లు ఎన్నింటికి వస్తాయో కనుక్కుందామని నేను, నా ఫ్రెండ్ విజయ్ రాత్రి 8.30కు నడుచుకుంటూ వెళ్ళాం. ఇంకా షాపు ఒక అరకిలోమీటర్ దూరం ఉండగా ఏదో గొడవ జరుగుతున్న సూచన కనిపించింది. ఎవరైనా కొట్టుకున్నారేమో అనుకున్నాం. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే ఆ గొడవ రేపు రాబోయే ఇంద్ర క్యాసెట్ కొనడానికి అడ్వాన్సు బుకింగ్ ఇవ్వడం కోసమని తెలిసే సరికి నోట మాట రాలేదు. సరే అని దూరంగా నిలుచుని చూస్తూ కూర్చున్నాం. రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. షాపు వాడు ఎంత సర్దిచెబుతున్నా వినే పరిస్థితి లేదు. 10 గంటలకు పోలీస్ జీపు రావడం, షాపు మూసేసి ఓనర్ ని అరెస్ట్ చేయటం చకచకా జరిగిపోయాయి. నిరాశగా వెనక్కు వచ్చేసాం. అసలు ఆడియో క్యాసెట్ కోసం జనం ఎగబడటం లైఫ్ లో ఫస్ట్ టైం చూసా.

ఉదయం కాగానే మళ్ళీ ఇద్దరం పరిగెత్తుకుంటూ టైం పదయ్యేలోపే రెగ్యులర్ గా మేము కొనే సలీం షాప్ కు వెళ్ళాం. జేబులో నాన్న దగ్గర బ్రతిమాలి తెచ్చుకున్న 40 రూపాయలు స్టైల్ గా ఇచ్చి ఇంద్ర క్యాసెట్ ఇమ్మన్నా. వాడు ఎగాదిగా చూసి నేనేదో ఆడి మెడలో ఉన్న గొలుసు అడిగినంత ఎక్స్ ప్రెషన్ ఇచ్చి ఉదయం 6 గంటలకే మొత్తం స్టాక్ అయిపోయింది, బ్లాక్ లో 70 రూపాయలకు పక్క షాప్ లో దొరుకుతుందన్నాడు. మతి పోయినంత పనయ్యింది. ఎలాగోలా వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకుని అప్పటికే అరిగిపోయి ఇన్ లే కార్డ్ చిరిగిపోయిన క్యాసెట్ సంపాదించి హమ్మయ్య అనుకుని ఇల్లు చేరి గంటల కొద్దీ వినడంలోనే రోజు సరిపోయింది. రిపీట్ మోడ్ లో పదే పదే పెడుతుంటే అమ్మ వల్లించిన తిట్ల వర్షం చెవికెక్కితే ఒట్టు. ఆడియో క్యాసెట్ ఇన్లే కార్డుని రోజుకోసారి తడుముతూ మురిసిపోవడం ఇప్పటి యుట్యూబ్ జనరేషన్ ఎప్పటికీ పొందలేని అనుభూతి.

జులై 24. ముందు రోజు రాత్రి సత్యం థియేటర్ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న డివైడర్ల మీద పడుకున్న అభిమానులను చూసి టికెట్ దొరుకుంతుందన్న నమ్మకం పోయింది. ఉదయం 6కు బెనిఫిట్ షో చూడాలనుకుంటే 12 గంటల ఆటకు అడుగుపెట్టాల్సి వచ్చింది. అదే కాంప్లెక్స్ లో నాలుగు స్క్రీన్లు ఉన్నా వాటికి నాలుగింతల జనం కౌంటర్ల దగ్గర ఉన్నారు. ధర 50 రూపాయలు. ఫస్ట్ క్లాస్ లేదు, సెకండ్ లేదు. అన్ని ఒకటే. అది మొదలు 130 రోజుల దాకా సీట్లు నిండిపోయినా నేల మీద కూర్చుని మరీ చూస్తున్నారు. 247 రోజులు. 52 లక్షలకు పైగా గ్రాస్ వచ్చింది. ఆదోని లాంటి బి సెంటర్లో ఇది చాలా పెద్ద మొత్తం. టౌన్ జనాభా మొత్తం చూశారా అనే స్థాయిలో వసూళ్ళ లెక్కలు కరెంట్ షాక్ కొట్టించాయి. ఇక్కడే కాదు అన్ని ఊళ్ళలో ఇదే ఊచకోత అని విన్నప్పుడు అదో తెలియని ఆనందం.

అప్పటి టికెట్ ధర అఫీషియల్ గా 30 రూపాయలు. ఈ లెక్కన ఇప్పటి లెక్కల్లో చూసుకుంటే ఎంతనో చెప్పనక్కర్లేదు. వీణ స్టెప్ కోసమే లెక్కలేనన్ని సార్లు చూసిన ఫాన్స్ ఎందరో. అది పిచ్చి అంటారా, వెర్రి అంటారా మీ ఇష్టం.మణిశర్మ సంగీతం, చిరు స్టెప్స్, యాక్షన్ ఎపిసోడ్స్, షౌకత్ ఆలీ ఖాన్ ఘట్టం, క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్లాక్, సమాధి సీన్, ఆర్తి అగర్వాల్ పెళ్లి చూపులు, ఇంద్ర ఆస్తుల త్యాగం సీన్ చెప్పుకుంటూ పోతే బుక్ అవుతుంది. మళ్లీ ఆ ప్రభంజనం చూడలేదు. ఏ సినిమా పత్రిక తిరగేసినా దీని గురించిన వార్తలే, రికార్డుల గురించి కథనాలే. అవి చదవడానికే రూపాయి అద్దె ఇచ్చి మరీ పాన్ షాపుల దగ్గర కాలేజీకి వెళ్ళేముందు కాపు కాసేవాళ్ళం. ఆ కబుర్ల ప్రవాహం నెలల తరబడి కొనసాగుతూనే వచ్చింది. డాడీ, శ్రీమంజునాథ లాంటి ఫ్లాపుల తర్వాత ఇది కదా మాకు కావలసిందని అనుకోని ఫ్యాన్ లేడు.

ఇంద్రలో మరీ గొప్ప కథేమి కనిపించదు. నిజానికి సమరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని అదే తరహా ఫ్యాక్షన్ కథలో చిరంజీవిని చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన రచయిత చిన్నికృష్ణను ప్రేరేపించి ఇంద్రను తయారు చేయించింది. కాకపోతే బాలయ్య సినిమాలో తన అనుచరుడి కుటుంబం కోసమే హీరో తాపత్రయపడతాడు. దానికే మాస్ అంతగా కదిలిపోయినప్పుడు కథానాయకుడు ఊరి కోసం ఏకంగా తన సర్వస్వమే ధారాదత్తం చేస్తే ఎలా ఉంటుంది. అందులోనూ మెగాస్టార్ లాంటి శిఖరం ఇలాంటి పాత్ర చేస్తే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా. అందుకే ఇంద్ర అంచనాలకు అతీతంగా సినిమా హాళ్ళలో పూనకాలు తెప్పించింది. పరుచూరి బ్రదర్స్ పదునైన సంబాషణలు ఎవ్వరిని కుర్చీల్లో కుదురుగా కూర్చోనివ్వలేదు.

మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా, రాననుకున్నారా రాలేననుకున్నారా, నా తప్పు లేకపోతే తలలు తీసుకెళ్ళేవాడిని, మీకు కత్తులు కావాల్రా నాకు చెయ్యి చాలు లాంటి డైలాగులకు ఈలలు వేసి వేసి అందరి నోళ్ళు నొప్పి పుట్టాయి. సోనాలి బెంద్రే, ఆర్తి అగర్వాల్ గ్లామర్ స్పెషల్ బోనస్ అయ్యింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డిటిఎస్ సౌండ్ లో ఎంత ఉద్విగ్నతను రేపిందో వర్ణించడం కష్టం. ఇక సాంగ్స్ గురించి రాయాలంటే పాటకో పది పేజీల వర్ణన వస్తుంది. అందుకే ఇంద్ర జ్ఞాపకాలు ఇన్నేళ్ళు అవుతున్నా కళ్ళ ముందు సజీవంగా కదలాడుతూనే ఉన్నాయి. నాకే కాదు వంద రోజులు ఆడిన 122 కేంద్రాల్లో అందరి ఫీలింగ్స్ ఇంచుమించు ఇవే అయ్యుంటాయి.

ఇంద్ర ఒక చరిత్ర....బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చి మాస్ పవర్ చూపించిన కమర్షియల్ గ్రంధం....

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp