మెంటల్ పోలీస్ ప్రేమకథకు 17 ఏళ్ళు - Nostalgia

By iDream Post Oct. 23, 2020, 06:16 pm IST
మెంటల్ పోలీస్ ప్రేమకథకు 17 ఏళ్ళు - Nostalgia

2003. దర్శకుడు పూరి జగన్నాధ్ భీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. మొదటి సినిమా పవన్ కళ్యాణ్ 'బద్రి' బ్లాక్ బస్టర్ అయినప్పటికీ తర్వాత చేసిన జగపతిబాబు 'బాచి' దారుణంగా దెబ్బ కొట్టింది. మళ్ళీ లేచి నిలబడే కసితో ఎక్కువ బడ్జెట్ లేకుండా స్టార్స్ ని తీసుకోకుండా తీసిన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' పేరునే కాదు డబ్బునీ తీసుకొచ్చింది. ఇక 'ఇడియట్' సృష్టించిన సునామి గురించి చెప్పేదేముంది. ఇండస్ట్రీలో దాని సౌండ్ మారుమ్రోగిపోయింది. ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యాయి. ఆ తర్వాత వెంటనే 'అమ్మ నాన్న తమిళ అమ్మాయి' రూపంలో మరో సూపర్ హిట్. ఆ టైంలో పిలిపించారు నాగార్జున. సంతోషం, మన్మథుడు బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ ల తర్వాత పూరి చెప్పిన ఓ మెంటల్ పోలీస్ కథ ఆయనకు విపరీతంగా నచ్చేసింది. అంతే శివమణి టైటిల్ తో దాని కింద ట్యాగ్ లైన్ గా అప్పుడే మొదలైన సెల్ ఫోన్ టెక్నాలజీని హైలైట్ చేస్తూ ఓ ఫోన్ నెంబర్ కూడా పెట్టి స్క్రిప్ట్ సిద్ధం చేశారు.

శివమణి కథకు స్ఫూర్తి 1999లో వచ్చిన మెసేజ్ ఇన్ ఏ బాటిల్ అనే నవల కం సినిమా. అందులో మెయిన్ థ్రెడ్ అయిన లవ్ స్టోరీని మాత్రమే తీసుకుని దానికి పోలీస్ ఆఫీసర్ కోటింగ్ ఇచ్చి పూరి ఓ బ్రహ్మాండమైన పాయింట్ తయారు చేశారు. ఇందులో హీరోకి కొంచెం మెంటల్. దాన్నే పైకి చెబుతుంటాడు కూడా. దేన్ని లెక్క చేయని తత్వం. వైజాగ్ లో పోలీస్ గా పనిచేస్తున్న సమయంలో వసంత(ఆసిన్)తో ప్రేమలో పడతాడు. కానీ లోకల్ డాన్ దత్తు(ప్రకాష్ రాజ్)వల్ల విడిపోవడమే కాదు గాయని కావాలనుకున్న వసంత మూగదైపోతుంది. దీంతో శివమణి ఉద్యోగం వదిలేసి ఎటో వెళ్ళిపోతాడు. అప్పుడు ఓ బాటిల్ సందేశం ద్వారా వీళ్ళ కథను తెలుసుకున్న జర్నలిస్ట్ పల్లవి(రక్షిత) ఈ ఇద్దరినీ కలిపే బాధ్యతను తీసుకుంటుంది. చివరికి కథ సుఖంతమవుతుంది.

డిఫరెంట్ ట్రీట్మెంట్ తో పూరి శివమణిని తీర్చిదిద్దిన తీరు అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యింది. పోలీస్ ఎపిసోడ్ నడుస్తున్నంత సేపు మాస్ ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. అయితే సెకండ్ హాఫ్ లో శివమణి వసంత మధ్య ప్రేమను చూపించే క్రమంలో పూరి దాన్ని ఎక్కువ సేపు సాగదీయడంతో ఇంపాక్ట్ తగ్గిపోయింది. కాకపోతే చక్రి ఇచ్చిన సాంగ్స్ అక్కడ జరుగుతున్న డ్యామేజ్ ని కవర్ చేశాయి. మెలోడీ ప్లస్ ఫాస్ట్ బీట్స్ రెండూ ఇచ్చి బాలన్స్ చేశారు చక్రి. కోన వెంకట్ సంభాషణలు పేలాయి. దీంతో అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా కమర్షియల్ గా ఫుల్ సేఫ్ అయ్యాడు శివమణి. అప్పటిదాకా నిర్ణయం, శాంతి క్రాంతి, రక్షణ సినిమాల్లో సీరియస్ పోలీస్ గా కనిపించిన నాగార్జున వాటికి విరుద్ధంగా శివమణిలో మెంటల్ గా కనిపించడం ప్లస్ అయ్యింది. పాతిక పైగా కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకుంది. పదిహేడేళ్ల క్రితం అక్టోబర్ 23న శివమణి రిలీజయ్యింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp