అంతేనా ......... ఇంకేం కావాలి ! - Nostalgia

By Ravindra Siraj Aug. 09, 2020, 03:50 pm IST
అంతేనా  ......... ఇంకేం కావాలి ! - Nostalgia

సరిగ్గా 14 ఏళ్ళ క్రితం టీనేజ్ వయసుతో మొదలుకుని వృద్ధుల దాకా అందరి నోళ్ళలో బాగా నలిగిపోయిన రెండు పదాలివి. ఒక ప్రేమ కథను కుటుంబం మొత్తం సలక్షణంగా చూసేలా ఎలా తీయాలో భాస్కర్ అనే కొత్త దర్శకుడు బాక్సాఫీస్ కు నేర్పించిన పాఠమది. విలువలతో కూడిన సినిమాలు వాళ్ళు మెచ్చేలా తీస్తే జనం చూస్తారన్న బలమైన నమ్మకంతో నిర్మాత దిల్ రాజు ధైర్యంగా ముందడుగు వేయడం ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వెండితెర ఆణిముత్యమది.

అరె హాసిని లాంటి అమ్మాయి నాకూ గర్ల్ ఫ్రెండ్ గా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకోని కుర్రాడు లేదు...

నేనెందుకు హాసినిలా లేనని తమను తాము పోల్చుకుని మార్చుకున్న అమ్మాయిలు ఎందరో.....

అచ్చం మా నాన్ననే స్క్రీన్ మీద చూసినట్టు ఉందే అని ఎందరో కొడుకులు మళ్ళీ మళ్ళీ చూసి మురిసిపోయారు.....

సిద్దులో తమను తాము చూసుకున్న యూత్ ని లెక్కబెట్టుకుంటే వైకుంఠఏకాదశి నాడు తిరుపతి కొండ మీద రద్దీ అంత భారీ నెంబర్ దొరుకుతుంది....

ఫ్యామిలీస్ థియేటర్లకు రావడం బొత్తిగా తగ్గిపోతోందని దిగాలు పడుతున్న ఎగ్జిబిటర్లకు టికెట్ల కోసం వాళ్ళ ఫోన్ పదే పదే మ్రోగడం ఇప్పటికీ మర్చిపోలేరు...

ఆ మేజిక్ పేరు బొమ్మరిల్లు...

ఒక చల్లని సాయంత్రం సముద్రపు ఒడ్డున మనకు ఇష్టమైన వాళ్ళ చేయి పట్టుకుని అలలను చూసుకుంటూ, కబుర్లు పంచుకుంటూ నడుస్తూ ఎంత దూరమైనా అలసట రాని మధురక్షణాలు ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా మందికి కలిగాయంటే అతిశయోక్తి అనిపించవచ్చు కాని ఇది నిజం. ఆహ్లాదం అనే పదం తెరకు దూరమవుతున్న తరుణంలో హద్దులు దాటని ఒక స్వచ్చమైన ప్రేమకథను నిజాయితిగా చెప్పిన ఓ దర్శకుడి ప్రయత్నం జేజేలే కాదు కాసులనూ కురిపించింది.

ఇందులో సిద్ధూ హాసినిలది అజరామరమైన లవ్ స్టొరీ కాదు. చిన్నప్పటి నుంచి కట్టుబాటుతో కూడిన పెంపకంలో స్వేచ్చ పదానికి ఆమడ దూరంలో ఉంటూ పెరిగిన సిద్దూ అనే కుర్రాడికి, మనసులో ఏదున్నా బయటికి చెప్పడం తప్ప కల్మషం అనే భావనకు అందనంత వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న హాసిని అనే కుర్రదానికి కలిగిన ఓ స్నేహం ఈ కథ. అరమరికలు ఉండవు. అడ్డుగోడలు ఉండవు. పరస్పర విరుద్ధ మనస్తత్వాలను కలిగిన రెండు భిన్న ధృవాలు ఎలా ఆకర్షింపబడ్డాయి అనే సన్నని దారం తీసుకుని రచయిత అబ్బూరి రవితో కలిసి భాస్కర్ అల్లిన అందమైన గూడు బొమ్మరిల్లు.

నిజానికి ఈ సినిమాలో క్లైమాక్స్ దాగా హెవీ ఎమోషన్స్ ఉండవు. తండ్రి వల్ల తాను ఎంత ఇబ్బంది పడుతున్నా దాన్ని బయటికి చెప్పుకోలేక సతమతమయ్యే సిద్ధూ మీద మనకు జాలి కలుగుతుంది తప్ప అతని నాన్న మీద కోపం రాదు. పైపెచ్చు కొన్నిసార్లు అతను అలా ఉండటం కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. పిల్లల్ని ఓ స్థాయికి మించి క్రమశిక్షణ అలవర్చాలని చూసి వాళ్ళకున్న కనీస ఫ్రీడంను కట్టడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో భాస్కర్ అద్భుతంగా చూపించాడు. అలా అని అరుచుకోవడాలు, సవాళ్ళు విసురుకోవడాలు ఏమి ఉండవు. అంతా సున్నితమైన భావోద్వేగాల మీద సాగుతుంది.

బొమ్మరిల్లుకి ప్రాణం హాసిని. చలాకీగా, గమ్మత్తుగా, అల్లరిగా, కలివిడిగా ఉండే అమ్మాయిలు మనకూ నిత్యం తారసపడరు. పైకొకటి లోపలొకటి పెట్టుకుని నటించే మేలిముసుగు వేసుకున్న ముద్దుగుమ్మలకు హాసిని ఒక రోల్ మోడల్ గా కనిపిస్తుంది. అనిపించింది అనేసెయ్, చేయాలనిపించింది చేసేసెయ్. తనకు తెలిసింది ఇంతే. ప్రాక్టికల్ గా ఇలా ఉండటం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు.ఇదే హాసిని మనకు నేర్పించే పాఠం.

ఇక్కడ బొమ్మరిల్లు కథాకమామీషు చెప్పే ఉద్దేశం లేదు. సినిమా అనే మాధ్యమం తాలుకు ప్రభావం ప్రేక్షకుల మీద ఖచ్చితంగా ఉంటుందన్న వాస్తవం ఒప్పుకోవాలి. శివ చూసి సైకిల్ చైన్లు పట్టుకుని వీధుల్లో తిరిగిన యూత్ ఉన్నట్టె బొమ్మరిల్లు చూసి తమకోసం ఒక హాసిని కావాలని పరిచయమైన ప్రతి అమ్మాయిలోనూ ఆ లక్షణాలు వెతికిన వాళ్ళు ఉన్నారు. తమ బిడ్డల పెంపకం విషయంలో ఏమైనా పొరపాట్లు చేస్తున్నామా అని చెక్ చేసుకున్న తల్లితండ్రులు ఉన్నారు. అందుకే బొమ్మరిల్లు ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. సినిమా చివర్లో 'మొత్తం మీరే చేశారు నాన్నా; అని సిద్దు అన్నప్పుడు థియేటర్లలో వినిపించిన ఈలలు, కేకలు చాలు మాస్ ఫార్ములా వండటంలో తలలు పండిన దర్శకులు సైతం నోరెళ్ళబెట్టారని చెప్పడానికి.

అంతేనా... ఇంకేం లేవా......

లేవు.. ముమ్మాటికి లేవు

హీరో హీరొయిన్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంటేనే యూత్ కి కనెక్ట్ అవుతుందన్న పడికట్టు సూత్రం ఇందులో లేదు....

ఎక్స్ పోజింగ్ చేయించి బోల్డ్ సీన్లు పెడితే తప్ప ఇప్పటి జనరేషన్ చూడరన్న పిచ్చి నమ్మకం ఈ యూనిట్ ఫాలో కాలేదు....

వెర్రిమొర్రి గెంతులు, పిచ్చి పిచ్చి పదాలతో పాటలు ఉంటేనే వైరల్ అవుతాయన్న సిద్ధాంతాన్ని ఇందులో చూడలేదు.....

కల్ట్ కంటెంట్ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు చొప్పించే అతి తెలివి ఇందులో కనిపించదు........

ఉన్నదల్లా స్వచ్చమైన అందమైన ప్రేమ కథ.......

అంతేనా...... ఇంకేం లేవా....

ఇంకేం కావాలి

" వీలైతే హోం థియేటర్లో బొమ్మరిల్లు షో, కుదిరితే హాసిని లాంటి అమ్మాయితో లైఫ్ "

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp