Pragya Jaiswal : నెగటివ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందిగా

By iDream Post Dec. 08, 2021, 12:30 pm IST
Pragya Jaiswal : నెగటివ్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యిందిగా

పరిశ్రమకు వచ్చి ఆరేళ్ళు దాటుతున్నా కెరీర్ సరైన రీతిలో కొనసాగక ఇబ్బంది పడుతున్న హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు అఖండ దెబ్బకు జాతకం మారిపోయేలా ఉంది. షూటింగ్ ప్రారంభ సమయంలో బాలయ్య లాంటి సీనియర్ హీరోతో చేయడం అవకాశాలను ప్రభావితం చేస్తుందేమో అనుకుంటే ఇప్పుడదే వరంగా మారింది. ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ప్రగ్య తన రెమ్యునరేషన్ ని కోటికి పెంచేసిందని ఫిలిం నగర్ టాక్. వరుణ్ తేజ్ కంచెతో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరీర్ ఆశించినంత వేగంగా సాగలేదు. నాగార్జునతో ఓం నమో వెంకటేశాయ చేయడం బాగానే దెబ్బ కొట్టింది. అది మొదలు ఆఫర్లు రావడం క్రమంగా తగ్గిపోతూ వచ్చాయి.

తర్వాత చేసిన గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు కావడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేసేశారు. బోయపాటే తీసిన జయ జానకి నాయకలో చేసిన చిన్న క్యామియో స్పెషల్ సాంగ్ కూడా అంతగా ఉపయోగపడలేదు. ఫైనల్ గా ఇంత గ్యాప్ తర్వాత కోరుకున్న బ్రేక్ దక్కింది. అఖండ విజయం తనలో ఉత్సాహాన్ని రేపింది. సీనియర్ల పక్కన జోడిగా తను ఆనుతుందా లేదా అనేదానికి సమాధానం దొరికేసింది. సో చిరంజీవి వెంకటేష్ లాంటి హీరోలు సైతం ఇకపై ప్రగ్యను ఆప్షన్ గా పరిగణించవచ్చు. ఇది ముందే ఊహించే తనదగ్గరకు వచ్చే నిర్మాతలకు కోటి దాకా చెబుతోందట.

ఇది నిజమో కాదో కానీ పూర్తిగా అయితే కొట్టిపారేయలేం. అఖండ ఇప్పటికే 50 కోట్ల షేర్ దాటేసింది. వారం లోపే బ్రేక్ ఈవెన్ చేరుకున్న పెద్ద సినిమాగా రికార్డులు నమోదవుతున్నాయి. ఇదంతా బాలయ్య వన్ మ్యాన్ షోనే అయినప్పటికీ ప్రగ్యని పక్కన బెట్టి చూడలేం. చేసింది కలెక్టర్ క్యారెక్టరే అయినా మాస్ టచ్ ఉండటంతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ప్రగ్య చేయబోయే కొత్త సినిమాల డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. తను ఇంకొద్ది రోజుల పాటు అఖండ ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో బిజీబిజీగా ఉంటోంది. పుష్ప థియేటర్లలో వచ్చేదాకా పబ్లిసిటీ ఆపకూడదని అఖండ టీమ్ డిసైడ్ అయ్యింది

Also Read : WWW : డిజిటల్ లో రానున్న టెక్నాలజీ థ్రిల్లర్ 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp