తక్కువ నిడివి బోలెడు కట్లతో క్రేజీ రిలీజ్

By iDream Post May. 08, 2021, 04:30 pm IST
తక్కువ నిడివి బోలెడు కట్లతో క్రేజీ రిలీజ్
ఇంకో అయిదు రోజుల్లో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రాధే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఏడాదికి పైగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేటర్లలో ఓటిటిలో సమాంతరంగా విడుదల చేస్తున్నామని జీ సంస్థ చెబుతూ వస్తోంది కానీ వాస్తవ పరిస్థితి చూస్తే దానికి భిన్నంగా ఉంది. 249 రూపాయల టికెట్ ధరను నిర్ణయించడం పట్ల ఇప్పటికే పలు విమర్శలు రేగిన నేపథ్యంలో జీ 5 ఏడాది చందాను అయిదు వందలకే ఇచ్చి రాధేని దాంతో పాటు ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది. దీనికి బాగానే స్పందన వస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫస్ట్ ప్రీమియర్ కు ఎంత మొత్తం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇక అసలు విషయానికి వస్తే రాధే పైకి థియేటర్లలో అన్నారు కానీ ప్రాక్టికల్ గా చూస్తే అది జరిగే పనిలా కనిపించడం లేదు. కర్ణాటక, తమిళనాడు సోమవారం నుంచి పూర్తి లాక్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పగలంతా కర్ఫ్యూ అమలులో ఉంది. తెలంగాణలో ప్రతిరోజు సాయంత్రం నుంచి అంతా బంద్. కేరళలో సైతం పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు. నార్త్ కు చాలా కీలకమైన మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. సినిమా హాళ్లు ఎప్పుడో మూసేశారు. కేవలం రాధే కోసమే ఇప్పుడు ప్రత్యేకంగా తెరుస్తారనుకోవడం కామెడీనే అవుతుంది.

సో రాధే రాబడి మొత్తం ఇప్పుడు ఓటిటి ప్లస్ డిటిహెచ్ టెలికాస్ట్ మీదే ఆధారపడి ఉంది. కేవలం 1 గంట 54 నిమిషాల నిడివితో సల్మాన్ ఖాన్ కెరీర్లోనే చిన్న సినిమాగా రాధే ఆల్రెడీ ఒక రికార్డును నమోదు చేసుకుంది. అంతే కాదు ఇంట్లో అందరూ చూసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి నిర్మాణ సంస్థే స్వయంగా 21 కట్లు వేసుకుని సెన్సార్ కు వెళ్లిందట. బోల్డ్ సీన్లు వయొలెన్స్ ఎక్కువగా ఉన్న సన్నివేశాలు ముందే కోతకు గురయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కంప్లయింట్ రాకుండా ముందు జాగ్రత్త పడ్డారన్న మాట. పైరసీ రాకాసి పొంచి ఉన్న తరుణంలో మరి ఈ రాధే చిన్నితెరపై ఎలాంటి మేజిక్ చేయబోతున్నాడో 13న తేలిపోతుంది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp