చిరు నిర్ణయాలు ఎందుకు మారాయి

By iDream Post Sep. 25, 2020, 07:16 pm IST
చిరు నిర్ణయాలు ఎందుకు మారాయి

ఆచార్య తర్వాత తాను చేయబోయే సినిమాలు దర్శకుల గురించి చిరంజీవే స్వయంగా ఓపెన్ కావడంతో ఇక సస్పెన్స్ కు తెరపడింది. వేదాళం రీమేక్ కు మెహర్ రమేష్, లూసిఫర్ కోసం వివి వినాయక్ ఫిక్సయ్యారు. నిజానికి ఈ కాంబినేషన్ల పట్ల అభిమానులు టెన్షన్ పడుతున్న మాట వాస్తవం. ఎందుకంటే ఈ ఇద్దరు డైరెక్టర్లు పూర్తిగా అవుట్ అఫ్ ఫామ్ లో ఉన్నారు. మెహర్ రమేష్ ఎప్పటి నుంచో దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఒక్క ప్రభాస్ బిర్లా తప్ప మిగిలిన కంత్రి, శక్తి, షాడో ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు కొట్టినవి. అందరు స్టార్లు పిలిచి మరీ అవకాశం ఇచ్చినా సద్వినియోగపరుచుకోలేదు. మరి అలాంటప్పుడు మెగాస్టార్ ని ఎలా డీల్ చేస్తాడా అనే అనుమానం కలగడం సహజం.

అయితే డైరెక్ట్ సబ్జెక్టు అయితే ఇబ్బంది కానీ పక్కా రీమేక్ కాబట్టి స్క్రిప్ట్ ని తెలుగులో రాసుకోవడం తప్ప పెద్దగా రిస్క్ ఉండదు. అందులోనూ బిల్లాను అదే తరహాలో తీసి మెప్పించాడు కాబట్టి మెగా కాంపౌండ్ ఆ కోణంలో ఆలోచించి ఓకే చెప్పి ఉండవచ్చు. ఆ ఫ్యామిలీతో ఎప్పటి నుంచో బాండింగ్ ఉన్న మెహర్ రమేష్ అది కూడా అవకాశం దక్కడానికి కారణం కావొచ్చు. ఏదీఏమైనా ఇంత కన్నా మంచి ఛాన్స్ తనకు దొరకదు. గట్టిగా ప్రూవ్ చేసుకుని హిట్టు కొడితే సెకండ్ ఇన్నింగ్స్ ని బ్రహ్మాండంగా నడుపుకోవచ్చు. ఇక వినాయక్ విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ ని డీల్ చేయడం దాని ఫలితం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ తన మీద సాఫ్ట్ కార్నర్ రావడానికి కారణం ఠాగూర్, ఖైదీ నెంబర్ 150లే. తమిళ రీమేకులను కథలో సోల్ చెడకుండా చిరు ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేయించి చూపించడంలో మంచి నేర్పరి అని ఋజువు చేసుకున్నాడు.

అందుకే ఎక్కువ ఆలోచన చేయకుండా తననే పిలిచినట్టు సమాచారం. ముందు అనుకున్న సుజిత్ ఒత్తిడి భరించలేకే తప్పుకున్నాడని, అందులోనూ పెళ్లి కావడంతో కొంత బ్రేక్ తీసుకోవాలనే ఆలోచనతో బై చెప్పినట్టు మరో టాక్ ప్రచారంలో ఉంది. వీటి సంగతెలా ఉన్నా కొరటాల శివ లాంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తర్వాత ఇద్దరు ఫ్లాప్ దర్శకులను చిరంజీవి ఎంచుకోవడం విచిత్రమే. అయితే జడ్జ్ మెంట్ విషయంలో అపారమైన అనుభవం ఉన్న మెగాస్టార్ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరని అందరూ చెబుతుంటారు కాబట్టి మరి వాటి తాలూకు రిజల్ట్ తెలియాలంటే మాత్రం ఇంకో రెండు సంవత్సరాలు ఆగాల్సిందే. ఆచార్య తర్వాత ఈ రెండు రీమేకులలో ఏది ముందు మొదలవుతుందో కూడా ఖరారు కావాల్సి ఉంది. దసరాకు ఒక అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp