ప్రేరణ సరే మరి రాధ ఎవరు ?

By iDream Post Oct. 13, 2020, 01:26 pm IST
ప్రేరణ సరే మరి రాధ ఎవరు ?

ఇవాళ హీరోయిన్ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ టీమ్ కొత్త పోస్టర్ విడుదల చేసింది. ట్రైన్ లో కూర్చుని ఎవరితోనో నవ్వుతు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ పిక్ క్యూట్ గా ఉంది. గ్రీన్ డ్రెస్ లో పూజా మెరిసిపోతోంది. ఎదురుగా ఉన్నది ప్రభాస్ లాగే కనిపిస్తున్నా కొంచెం కూడా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. పిక్ ని లోతుగా గమనిస్తే వెనుకాల సీట్లో ఓ పెద్దావిడ, కొందరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. హ్యాపీ బర్త్ డే ప్రేరణ అంటూ టీమ్ తరఫున శుభాకాంక్షలు కూడా అందజేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడో సందేహం వస్తోంది. టైటిల్ ని బట్టి చూస్తే ప్రభాస్, పూజల పేర్లు రాధ, శ్యామ్. కానీ ఇక్కడ ప్రేరణ అన్నారు.

ఈ లెక్కన చూస్తే గతంలో ప్రచారంలోకి వచ్చిన స్టోరీ లీక్ ప్రకారం ఇది పునర్జన్మల కథలాగే కనిపిస్తోంది. అందులోనూ ఎప్పుడో దశాబ్దాల నాటి ఇటలీ బ్యాక్ డ్రాప్ అన్నారు కాబట్టి ఇప్పుడా వార్తకు మరింత బలం చేకూరుతోంది. అంటే వర్తమానంలో మొదలుపెట్టి మగధీర టైపులో ఏమైనా వెనక్కు తీసుకెళ్తారేమో చూడాలి. మొత్తానికి పూజా హెగ్డే అభిమానులకు మంచి కానుకే ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటికీ రాధే శ్యామ్ సంగీత దర్శకుడు ఎవరో తేల్చనే లేదు. ఈ పిక్ లో కూడా ఆ ప్రస్తావన లేదు. సాహోకు కూడా ఇదే తరహాలో సాగదీసి ఆఖరికి నలుగురైదురితో చేయించి ఖంగాళీ పాటలు ఇప్పించిన సంగతి తెలిసిందే. దీనికి కూడా అలాగే చేస్తారేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.

అసలే సాహో కన్నా భారీ బడ్జెట్ తో రాదే శ్యాం రూపొందుతోంది. పైగా లవ్ స్టోరీ. యాక్షన్ థ్రిల్లర్ అయితే సాంగ్స్ ఎలా ఉన్నాయా కవర్ చేయొచ్చు. కానీ ప్రేమకథలుకు పాటలే ప్రాణం. కానీ ఈ విషయంలో మాత్రం యువి సంస్థ ఎందుకింత అలసత్వం ప్రదర్శిస్తోందో అర్థం కావడం లేదు. ఈ సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగేలా ఉంది. వచ్చే ఏడాది విడుదల కాబోతున్న రాధే శ్యామ్ బాలన్స్ షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. అక్కడి వర్క్ పూర్తి కాగానే తిరిగి వచ్చి ఇక్కడ పార్ట్ ని ఫినిష్ చేస్తారు. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న రాధే శ్యామ్ బడ్జెట్ రెండు వందల కోట్లకు పైగానే అని ఇన్ సైడ్ టాక్. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ బాహుబలి తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అవ్వాలని ఫ్యాన్స్ కోరిక. అక్టోబర్ 23న టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp