ఇండియన్ 2 ఏం చేయబోతున్నాడు

By iDream Post Oct. 23, 2020, 03:30 pm IST
ఇండియన్ 2  ఏం చేయబోతున్నాడు

1996లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన భారతీయుడు సీక్వెల్ ఇండియన్ 2 షూటింగ్ లాక్ డౌన్ కు ముందే క్రేన్ ప్రమాదం వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కరోనా వల్ల చెలరేగిన పరిణామాలు పెద్ద బ్రేక్ వేశాయి. మెల్లగా పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. స్టార్లు ఒక్కొక్కరుగా సెట్లకు వస్తున్నారు. నవంబర్ నుంచి పూర్తి స్థాయిలో అన్ని బాషల ఇండస్ట్రీలు పూర్వ స్థితికి చేరుకుంటాయనేది విశ్లేషకుల అంచనా. ఖచ్చితంగా చెప్పలేకపోయినా అభిప్రాయమైతే అయితే గట్టిగానే వినిపిస్తోంది.. ఇదిలా ఉండగా ఇండియన్ 2కి సంబంధించి ఒక హాట్ టాక్ చెన్నై వేదికగా సాగుతోంది. దాని ప్రకారం నిర్మాణ సంస్థ లైకాకు దర్శకుడు శంకర్ కు ఇంకా పూర్తి స్థాయిలో ఒప్పందం కుదరలేదట.

ముందుగా అన్ని కాంప్రోమైజులు పోనూ ఇండియన్ 2కు అనుకున్న బడ్జెట్ సుమారు 200 కోట్లు. దానికన్నా ముందు శంకర్ ఇచ్చిన ఎస్టిమేషన్ నాలుగు వందల కోట్ల దాకా ఉందట. అయితే 2.0కు అంత ఖర్చు పెట్టినా నష్టాలు వచ్చిన నేపథ్యంలో దీన్ని మాత్రం తగ్గించే చేయాలని లైకా చెప్పడంతో శంకర్ రాజీ సూత్రం అవలంబించారు. అయితే ఇప్పుడు అందులోనూ కోత పెట్టే ప్రతిపాదన రావడంతో శంకర్ అందుకు ఇష్టపడటం లేదని సారాంశం. క్రేన్ యాక్సిడెంట్ జరిగాక షూటింగ్ చాలా రోజులు ఆగిపోవడం, నష్టపరిహారాలు, కోర్టు వ్యవహారాలు తదితరాలకు అదనంగా ఖర్చు కావడం వగైరా కారణాలు లైకాకు భారంగా మారాయని చెబుతున్నారు. అందుకే ప్లాన్ చేసుకున్న దానికన్నా తగ్గించే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

దీంతో శంకర్ లైకాకు ఒక లేఖ రాస్తూ ఒకవేళ ఇండియన్ 2 ఇంకా ఆలస్యమయ్యే తరుణంలో తను వేరే ప్రాజెక్ట్ చూసుకుంటానని అందులో పేర్కొన్నట్టు వినికిడి. కమల్ హాసన్ తో పాటు ఈ సీక్వెల్ లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ లతో పాటు భారీ తారాగణం ఉంది. వీళ్లంతా చేతిలో ప్రాజెక్టులు ఉన్న బిజీ ఆర్టిస్టులు. ఇండియన్ 2 కొనసాగించాలంటే వీళ్లందరి కాల్ షీట్స్ ని సర్దుబాటు చేసుకోవడం అంత సులభం కాదు. పైగా సెట్ వర్క్ కూడా చాలా బ్యాలన్స్ ఉందట. ఇప్పుడు మొదలుపెడితేనే ఎప్పుడో వేసవిలో దసరాకో పూర్తవుతుంది. అలాంటిది ఇంకా జాప్యం జరిగితే 2022లోనే విడుదల చేయాల్సి వస్తుంది. అందుకే ఇండియన్ 2 ప్రస్తుతం డైలమాలో ఉన్నాడనేది కోలీవుడ్ టాక్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp