హిందీ సినిమాల ఫ్యూచర్ ఏంటి

By iDream Post Jun. 19, 2021, 12:30 pm IST
హిందీ సినిమాల ఫ్యూచర్ ఏంటి

సరే కరోనా కేసులు తగ్గుతున్నాయి, థియేటర్లు కూడా తెరుచుకోవచ్చు అంటున్నారు ఇంకేం ధైర్యంగా విడుదల ప్లాన్ చేసుకోవచ్చని సంబర పడుతున్న బాలీవుడ్ నిర్మాతలకు ఇంకొన్ని నెలలు కంటి మీద కునుకు దక్కడం కష్టమే. తాజాగా కరోనా థర్డ్ వేవ్ గురించి మహారాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన రిపోర్ట్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంది. మరోసారి ఈ మహమ్మారి దాడి చేయనుందని, కేసులు రెట్టింపు స్థాయిలో ఉంటాయని అక్కడి ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇవ్వడంతో హిందీ నిర్మాతల ఆందోళన అంతా ఇంతా కాదు. ఇప్పటికే అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ రిలీజ్ డేట్ ని జులై 27 అని ప్రకటించారు. ఇప్పుడు ఇందులో మార్పు జరిగినా ఆశ్చర్యం లేదు.

బాలీవుడ్ కు కేంద్రంగా కమర్షియల్ సెంటర్ గా ఉన్న ముంబై మహారాష్ట్రలోనే ఉంది. దేశవ్యాప్తంగా రెవిన్యూకి సంబంధించిన మేజర్ షేర్ అక్కడి నుంచే వస్తుంది. సో దాన్ని మినహాయించి   మిగిలిన చోట్ల సినిమాలు రిలీజ్ చేయడం అసాధ్యం. ఇప్పుడు కమిటీలు ఇచ్చిన రిపోర్టులు నిజమైన పక్షంలో మళ్ళీ థియేటర్లను మూసివేయక తప్పదు. అసలే సూర్యవంశి, 83 లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఏడాదిన్నరగా కోట్ల రూపాయల పెట్టుబడి భారాన్ని మోస్తూ విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓటిటి నుంచి ఎంత టెంప్టింగ్ ఆఫర్లు వచ్చినా కూడా వాటిని తిరస్కరించి మరీ ఎదురు చూస్తున్నాయి.

వ్యాక్సిన్లు జనాలకు మెల్లగా అందుతున్నప్పటికీ ఉండాల్సిన వేగం లేదన్నది వాస్తవం. ఇదంతా సద్దుమణగడానికి కనీసం సెప్టెంబర్ దాకా వేచి చూడాలనే దిశగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగు తమిళ కన్నడ మలయాళంకు ఇంత సమస్య లేదు. ఒకవేళ నార్త్ లో విడుదల చేయకపోయినా మన సినిమాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కొంత కలెక్షన్ తగ్గడం మినహాయించి సమస్య ఉండదు. ఎటొచ్చి థర్డ్ వేవ్ మన జోలికి రాకపోతేనే మేలు. చూస్తుంటే రష్మీ రాకెట్, హసీన్ దిల్ రుబా, తూఫాన్ తరహాలో మరిన్ని బాలీవుడ్ సినిమాలకు ఓటిటి బాట మినహాయించి మరో మార్గం కనిపించేలా లేదు. చూద్దాం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp