హిందీ సినిమాల భవిషత్తు ఏంటి

By iDream Post Apr. 18, 2021, 11:15 am IST
హిందీ సినిమాల భవిషత్తు ఏంటి
కరోనా సెకండ్ వేవ్ అన్నంత పనీ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే జనజీవనం ఎంత మాములుగా కనిపిస్తున్నా కూడా బయట పరిస్థితి చాలా దారుణంగా ఉంటోంది. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ లాంటి మహా నగరాలు వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. జనం ఇళ్లలో నుంచి బయటకి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన సిచువేషన్. ఈ నేపధ్యంలో బాలీవుడ్ విపరీతమైన ఆందోళన మధ్య తమ సినిమాల భవిష్యత్తు గురించి తలలు పట్టుకుంటోంది. విడుదల ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలో అర్థం కాక పెట్టుబడులు బ్లాక్ అయిపోయి ఒత్తిడితో నలుగుతున్న నిర్మాతలు ఇప్పుడు వందల్లో ఉన్నారు.

ఓటిటి తాకిడి గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఉన్నంతగా ఇప్పుడు లేదు. తొందరపడి కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి కేవలం క్రేజ్ ని నమ్ముకుని కొన్న సినిమాలు డిజాస్టర్ రిపోర్ట్స్ తో షాక్ ఇవ్వడంతో సదరు సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. మూవీ చూశాకే రేట్ ఆఫర్ చేస్తామని మెలిక పెడుతున్నాయి. లేదా పే వ్యూస్ మోడల్ లో రెవిన్యూ షేర్ చేసుకుందామని ప్రతిపాదన ఇస్తున్నాయి. ఇది మీడియం బడ్జెట్ సినిమాలకు వర్కౌట్ కాదు. అన్నీ బలమైన కంటెంట్ ఉన్నవి కాదుగా. అందుకే థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే దాకా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కానీ ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు.

అక్షయ్ కుమార్ సూర్యవంశీతో మొదలుపెట్టి అజయ్ దేవగన్ మైదాన్ దాకా సుమారు యాభై దాకా బాలీవుడ్ మూవీస్ క్యూలో ఉన్నాయి. వచ్చే వారం రావాల్సిన తలైవిని కూడా పోస్ట్ పోన్ చేశారు. చూస్తేనేమో వెయిటింగ్ లిస్టులో ఉన్న సినిమాల సంఖ్య అంతకంతా పెరుగుతూ పోతోంది. ప్రభుత్వాలు ఫ్యూచర్ గురించి ఏమి చెప్పలేకపోతున్నాయి. వ్యాక్సిన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. అధిక శాతం జనాభా రెండు డోసుల టీకా వేసుకుంటే తప్ప మునుపటిలా నార్త్ రాష్ట్రాలు కళకళలాడేలా లేవు. మరి ఇదంతా ఎప్పుడు సద్దుమణుగుతుందో బాలీవుడ్ సినిమాలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో తెలిసింది ఆ సర్వాంతర్యామికే.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp