వెంకటేష్ అనిల్ కపూర్ ఎక్స్ చేంజ్ మేళా - Nostalgia

By Ravindra Siraj Feb. 14, 2020, 12:02 pm IST
వెంకటేష్ అనిల్ కపూర్ ఎక్స్ చేంజ్ మేళా - Nostalgia

తెలుగులో కుండమార్పిడి అనే పదం ఒకటుంది. అంటే మాఇంట్లో అమ్మాయిని మీరు చేసుకుంటే మీఇంట్లో అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అనే స్కీం అన్న మాట. ఇది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. కాకపోతే అటు ఇటు రెండుపక్కలా పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు ఉంటేనే వర్తిస్తుంది అది వేరే విషయం. ఇది సినిమాలలోనూ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ చేంజ్ రీమేక్ రూపంలో జరుగుతుందన్న మాట. ఇది మన వెంకటేష్, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ల విషయంలో జరిగింది. అదెలాగో చూద్దాం.

1988లో అనిల్ కపూర్ హీరోగా చంద్ర దర్శకత్వంలో తేజాబ్ వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్టు. వన్ టూ త్రి అంటూ మాధురి దీక్షిత్ చేసిన డాన్స్ కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రికార్డుల మోతమోగిపోయింది. కట్ చేస్తే దీన్ని తెలుగు హక్కులు మొదట రామానాయుడు తీసుకున్నారు. తర్వాత ఎందుకో నిర్మాత మారి దాసరి నారాయణరావు దర్శకత్వంలో టూ టౌన్ రౌడీగా రీమేకయ్యింది. కృష్ణంరాజు, నరేష్ కూడా అందులో నటించారు. భారీ హిట్టు కాదు కానీ కమర్షియల్ గా పాస్ అయ్యింది

అదే 1988లో వచ్చిన వెంకటేష్ బ్రహ్మపుత్రుడుని హిందీలో అనిల్ కపూర్ తో రఖ్ వాలా పేరుతో రామానాయుడు గారే మురళీమోహన్ రావు దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ తీసింది దాసరి గారు. కానీ తెలుగులో బాగా ఆడిన బ్రహ్మపుత్రుడు హిందీలో యావరేజ్ హిట్ గా నిలిచింది. మనకు కనెక్ట్ అయిన చైల్డ్ సెంటిమెంట్ నార్త్ వాళ్లకు అంతగా ఎక్కలేదు. తేజాబ్ రీమేక్ తెలుగులో పర్వాలేదు అనిపించుకుంటే బ్రహ్మపుత్రుడు రీమేక్ హిందీలో అదే రిజల్ట్ తెచ్చుకుంది. అంటే వెంకటేష్, అనిల్ కపూర్ ఇద్దరూ పరస్పరం చేసుకున్న ఎక్స్ చేంజ్ రీమేక్స్ లో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయారు. కాకతాళీయంగా రెండు సినిమాల్లో కామన్ గా వినిపించిన దర్శకుడి పేరు దాసరి కావడం గమనార్హం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp