ఉప్పెనగా వస్తున్న మెగా మేనల్లుడు 2

By Ravindra Siraj Jan. 24, 2020, 11:21 am IST
ఉప్పెనగా వస్తున్న మెగా మేనల్లుడు 2

ఇప్పటికే మెగా మేనల్లుడు 1 రూపంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా సెటిలైపోయాడు. మొదటి సినిమా రేయ్ దారుణంగా దెబ్బ తిన్నప్పటికీ పిల్లా నువ్వు లేని జీవితంతో బోణీ కొట్టేసి ఆ తర్వాత సుప్రీమ్ తో కుదురుకున్నాడు. ఆ మధ్య వరసగా ఆరు డిజాస్టర్లతో మార్కెట్ ని ఇబ్బందుల్లో పాడేసుకున్న తేజుకి చిత్రలహరి కొంత ఊరటనివ్వగా ఏడాది చివర్లో వచ్చిన ప్రతి రోజు పండగే మళ్ళీ ట్రాక్ లో పడేసింది. హిట్ అయితే చాలు అనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ వసూళ్లు ఇచ్చింది.

ఇదలా ఉంచితే ఇప్పుడు మెగా మేనల్లుడు 2 రంగంలోకి దిగుతున్నాడు. అదే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూకి రంగం సిద్ధమయ్యింది. ఉప్పెన పేరుతో మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేశారు. హీరో మొహం పూర్తిగా చూపించకుండా సముద్రం హోరులో ముందుకు తిరిగి అరుస్తున్న వైష్ణవ్ స్టిల్ ని రిలీజ్ చేశారు. అంతకు మించి ఇందులో ఏ ప్రత్యేకత లేదు. కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఉప్పెనకు దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చాడు.

రంగస్థలంతో అవార్డులు గెలుచుకున్న రామకృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేయడం విశేషం. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా డెబ్యూ ఇస్తున్నాడు. పెద్దగా అంచనాలు లేకపోయినా సముద్ర తీరంలో జరిగే ప్రేమ కథగా యూనిట్ ప్రత్యేకంగా ఉంటుందని చెబుతోంది. అన్నింటికన్నా ప్రధాన ఆకర్షణ విలన్ గా నటిస్తున్న విజయ్ సేతుపతి. సైరాలో చిన్న క్యామియోతో టాలీవుడ్ కు పరిచయమైనా ఈ వర్సటైల్ యాక్టర్ ఇందులో ఫుల్ లెన్త్ విలన్ గా చేయడం ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ మెగానల్లుడు 2 ఏ మేరకు మెప్పిస్తాడా ఉప్పెన విడుదలయ్యే ఏప్రిల్ 2న తేలిపోతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp