అతి త్వరలో రాబోతున్న నాని 'వి' ?

By iDream Post Aug. 12, 2020, 10:56 am IST
అతి త్వరలో రాబోతున్న నాని 'వి' ?

సరిగ్గా లాక్ డౌన్ ప్రకటించిన రెండో రోజులకే విడుదల తేదీ ముందే ఫిక్స్ చేసుకుని అప్పటి నుంచి ఎదురు చూస్తున్న నాని వి సినిమాకు ఎట్టకేలకు డిజిటల్ రూపంలో మోక్షం కలిగినట్టుగా ఫిలిం నగర్ హాట్ అప్డేట్. మార్చి 25 నుంచి వాయిదా పడుతూ వచ్చి ఇప్పటికే అయిదు నెలలు దాటేసింది. ధియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అంత అనుభవం ఉన్న నిర్మాత దిల్ రాజుకే అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఇంత కన్నా ఆలస్యం చేయడం మంచిది కాదని గుర్తించి అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలిసింది. సుమారుగా 33 కోట్ల మార్కు దగ్గర హక్కులను ఇచ్చేసినట్టుగా చెబుతున్నారు. అయితే ఇది అధికారికంగా వచ్చిన ప్రకటన కాదు. ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా వచ్చి ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వచ్చే సెప్టెంబర్ 5నే రిలీజ్ డేట్ గా లాక్ చేసినట్టుగా కూడా చెబుతున్నారు. నాని కూడా ఈ విషయంగా చాలా రోజుల నుంచి మౌనంగానే ఉన్నాడు. ఇది తనకు 25వ సినిమా. అభిమానులు తమ హీరో ల్యాండ్ మార్క్ మూవీని థియేటర్లోనే ఎంజాయ్ చేయాలనీ కోరుకుంటున్నారు కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా లేవు. ఒకవేళ ఇప్పుడిది నిజమైతే సౌత్ లోనే ఓటిటిలో వస్తున్న పెద్ద స్టార్ హీరో చిత్రం వినే అవుతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ రివెంజ్ థ్రిల్లర్ లో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా నాని కిల్లర్ గా కనిపిస్తాడు. ఇతర పాత్రల్లో అదితి రావు హైదరి, నివేదా థామస్ లు ఉన్నారు.

సైరా ఫేమ్ అమిత్ త్రివేది పాటలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకర్షణలుగా నిలవబోతున్నాయి. టీజర్ వల్ల ఇప్పటికే కావలసినంత హైప్ వచ్చేసింది. ప్రైమ్ కనక ప్రమోషన్ మొదలుపెడితే అది ఇంకో లెవెల్ కు వెళ్ళిపోతుంది. పెంగ్విన్, ఉమామహేశ్వరఉగ్రరూపస్య లాంటి బడ్జెట్ సినిమాలకే ఆన్ లైన్లో భారీ స్పందన దక్కిన నేపధ్యంలో నాని వి సరికొత్త రికార్డులు వ్యూస్ పరంగా సృష్టించడం ఖాయమని నెట్ ట్రెండ్స్ ని విశ్లేషించే పరిశీలకుల అంచనా. ఇదే జరిగితే మిగిలిన నిర్మాతలకు దారి దొరుకుతుంది. ఇప్పటికే నిశబ్దం, అరణ్య, రెడ్, ఉప్పెన, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, సోలో బ్రతుకే సో బెటరూ(కొంత భాగమే పెండింగ్ ఉంది)లాంటివన్నీ థియేటర్ల తలుపులు తెరుచుకోవడం కోసం ఎదురు చూస్తున్నాయి. 'వి'ని చూసి ఇందులో ఒకటో రెండో తమ నిర్ణయాన్ని మార్చుకున్నా ఆశ్చర్యం లేదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp