తెలుగు దర్శకుల కొత్త పంథా

By iDream Post Jun. 19, 2021, 01:30 pm IST
తెలుగు దర్శకుల కొత్త పంథా

ఇప్పటిదాకా మన హీరోలు నిర్మాతలు తమిళ దర్శకుల వెంటపడటం చూసాం చూస్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు ఆరవ స్టార్లు మనవాళ్ళతో ఏరికోరి మరీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న కొత్త ట్రెండ్ మొదలయ్యింది. నిన్న ధనుష్-శేఖర్ కమ్ముల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. రేపో ఎల్లుండో అతి త్వరలో విజయ్ - వంశీ పైడిపల్లి ప్రకటన రాబోతోంది సూర్య కూడా బోయపాటి శీనుతో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. దీనికీ దిల్ రాజునే నిర్మాతగా ఉండొచ్చనే టాక్ ఉంది. ఇవి కాకుండా టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న డైరెక్టర్ల మీద పక్క రాష్ట్రాల వాళ్ళు గట్టి కన్ను వేస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.

మనం ఇతర బాషల నుంచి దర్శకులను తెచ్చుకోవడం ఇప్పటిది కాదు. ముప్పై ఏళ్ళ క్రితం నాగార్జున ప్రియదర్శన్ ని తీసుకురావడం దగ్గరి నుంచి ఇప్పుడు చిరంజీవి మోహన్ రాజాను మాట్లాడుకోవడం దాకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సురేష్ కృష్ణ, కరుణాకరన్, ఎస్ జె సూర్య లాంటి వాళ్ళు ఇక్కడ ప్రూవ్ చేసుకున్నాకే తమ స్వంత గడ్డ మీద సక్సెస్ అయిన ఉదంతాలు ఎన్నో. ఫాజిల్ లాంటి మల్లు వుడ్  దర్శకులనూ మనం వదల్లేదు. అయితే తమిళ మలయాళంలో మన వాళ్ళు జెండా పాతిన దాఖలాలు పెద్దగా లేవు. రాజమౌళికి మార్కెట్ వచ్చింది కానీ అది కేవలం బాహుబలి డబ్బింగ్ వెర్షన్ వల్ల మాత్రమే.

ఇక్కడ ఇంకో కోణం ఉంది. మన హీరోల డిమాండ్లు రాను రాను పెరిగిపోతున్నాయి. కథల విషయంలో వంకలు పెట్టడం, ప్రొడక్షన్ తో పాటు సినిమాకు సంబందించిన ఇతరత్రా హక్కుల్లో వాటాలు అడగటం లాంటి వాటి వల్ల అగ్ర నిర్మాతలు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇక దర్శకుల పాట్లు చెప్పేవి కాదు. ఎందుకొచ్చిన తలనెప్పని ఇక్కడ ఇమేజ్ ఉన్న డైరెక్టర్లు తమిళం నుంచి స్టార్ ఆఫర్లు రాగానే ఎస్ చెప్పేస్తున్నారు. ఏళ్లకు ఏళ్ళు వేచి చూసే బదులు ఇలా వర్కౌట్ చేసుకుంటే మార్కెట్ కూడా పెరుగుతుందనేది వాళ్ళ ఆలోచన. మొత్తానికి అటుఇటు ఈ దర్శకుల ఎక్స్ చేంజ్ మేళా ఏదో బాగున్నట్టే ఉంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp