తీపి కన్నా చేదే ఎక్కువ

By iDream Post Jun. 30, 2021, 06:41 pm IST
తీపి కన్నా చేదే ఎక్కువ

అప్పుడే 2021లో సగం అయిపోయింది. ఇవాళ్టితో ఆరు నెలలు పూర్తయ్యాయి. ఎన్నో ఆశలతో ఎంతో ఘనంగా దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ ఎత్తున సినిమా రిలీజులతో కళకళలాడిన టాలీవుడ్ నాలుగు నెలలు తిరక్కుండానే కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్ళీ కుదేలైపోయింది. క్రాక్, మాస్టర్ వసూళ్లు జనవరిలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తే ఉప్పెన ఫిబ్రవరి మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుని వసూళ్ల అలలతో పోటెత్తించింది. మార్చిలో జాతిరత్నాలు చిన్న చిత్రాల సత్తా చాటి ముప్పై కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. టాకులు రివ్యూలతో సంబంధం లేకుండా జార్జ్ రెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటివి బయ్యర్లకు లాభాలు తెచ్చి పెట్టాయి.

థియేటర్లు మునుపటిలాగా వైభవంతో కనిపించాయి. జనం హౌస్ ఫుల్ చేయించారు. వకీల్ సాబ్ కు ఏకంగా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు ఫ్లాప్ అయినా మంచి ఓపెనింగ్స్ దక్కాయి. శ్రీకారం, చెక్, రంగ్ దే లాంటివి కేవలం ఈ కారణంగానే నష్టాలు తగ్గించుకున్నాయి. జనంలో ఏ మాత్రం కరోనా భయం ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటర్లు ఇంకా దారుణంగా నష్టపోయేవాళ్ళు. నాంది లాంటి సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామాకు సైతం ప్రేక్షకులు వచ్చారంటే దానికి కారణం మన ఆడియన్స్ కి సినిమా మీద ప్రేమ తప్ప ఇంకేదీ కాదు. కానీ ఇదంతా ఇప్పుడు నీటి మీద బుడగ అయ్యింది.

లాక్ డౌన్ ఎత్తేసినా కూడా థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. మరోవైపు పెద్ద హీరోల సినిమాలు ఓటిటి లో వస్తాయన్న వార్తలు ఎగ్జిబిటర్లను టెన్షన్ పెడుతున్నాయి. సురేష్ బాబు లాంటి అనుభవం ఉన్న నిర్మాత కూడా డిజిటల్ వైపు చూస్తున్నారన్న టాక్ మాములు కలకలం రేపలేదు. ఇప్పుడు మళ్ళీ మంచి రోజుల కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. అది ఈ నెలనా లేక ఆగస్టా అనేది మన చేతుల్లో లేదు కానీ నిజంగా హాళ్లు తెరుచుకుంటే మళ్ళీ ఆడియన్స్ తమ ప్రేమను చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి ప్రొడ్యూసర్లకే రకరకాల అనుమానాలు. మళ్ళెప్పుడు ఇది జరగకూడదు. ఈ జెనరేషన్ కే కాదు ఇంకే తరానికి ఈ గడ్డు స్థితి రాకూడదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp