అప్పుడు నవ్వారు ఇప్పుడు జై అంటున్నారు

By iDream Post Jul. 05, 2020, 05:57 pm IST
అప్పుడు నవ్వారు ఇప్పుడు జై అంటున్నారు

ఏడేళ్ల క్రితం 2013లో కమల్ హాసన్ తన విశ్వరూపం సినిమాకు తమిళనాడు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం భరించలేక అప్పుడప్పుడే దారులు తెరుచుకుంటున్న డిటిహెచ్ టెక్నాలజీతో నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటికే ప్రసారం చేయాలనీ ప్రయత్నించారు. అప్పుడది టీవీ ప్రోగ్రాం కిందకు వస్తుంది కాబట్టి సెన్సార్ అక్కర్లేదు. కనెక్షన్ కు ఓ ఐదు వందలు లేదా అంతలోపే ఛార్జ్ ఫిక్స్ చేసి ఆ మేరకు రెవిన్యూ వచ్చేలా గట్టి ప్లానె వేశారు. కాని డిస్ట్రిబ్యూటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. ఇలా చేస్తే భవిష్యత్తులో కమల్ సినిమా లేవి పంపిణి చేయమని నేరుగా ప్రకటనల రూపంలో బెదిరించారు.

ఇప్పుడు కాదన్నా భవిష్యత్తులో డైరెక్ట్ రిలీజులు ఉంటాయని అప్పుడు లోక నాయకుడు జోస్యం చెప్పినప్పుడు నవ్విన వాళ్ళే ఎక్కువ. థియేటర్లలో కాకుండా ఇలా నేరుగా ఎలా విడుదల సాధ్యమంటూ ఎగతాళి చేశారు. తర్వాత ఏవేవో రాజీ ప్రయత్నాలు, బేరాలు తర్వాత ముందు తెలుగులో ఆపై తమిళ్ లో విశ్వరూపం ఎట్టకేలకు హాళ్ళలోనే రిలీజయ్యింది. బాగానే ఆడింది కూడా. కట్ చేస్తే 2020లో ఇప్పుడంతా డిజిటల్ మయమైపోయింది. కేవలం అతి తక్కువ కాలంలో కమల్ చెప్పిన మాటలు నిజమయ్యాయి. కారణం ఏదైనా కావొచ్చు. కరోనా రాకపోయి ఉంటే ఓటిటి ఉదృతి ఈ రేంజ్ లో ఉండేది కాదన్నది కూడా వాస్తవం. ఎలా జరిగినా అక్షరాల అప్పుడు అన్నది ఇప్పుడు జరిగింది. సినిమాలు నేరుగా ప్రేక్షకుల స్మార్ట్ ఫోన్లు, టీవీల్లోకి వచ్చేస్తున్నాయి.

అదనంగా పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చుని కావలసినవి చెసుకుని తింటూ రిక్లైనర్ సీటుకు మించిన సౌఖ్యాన్ని అనుభవిస్తూ బోర్ కొట్టినప్పుడు ఫార్వార్డ్ చేస్తూ జనాలు వినోదాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటిదాకా అమృతరామమ్, పెంగ్విన్, 47 డేస్, భానుమతి & రామకృష్ణ వచ్చేశాయి. మూడో వారంలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వస్తోంది. మరికొన్ని క్యులో ఉన్నాయి. హిందిలో ఏకంగా పదిహేను దాకా వచ్చే రెండు నెలల్లో డైరెక్ట్ రిలీజ్ కు నోచుకుంటున్నాయి. ఏదో ఒక రూపంలో కమల్ చెప్పిన మాటలు ఇప్పుడు కళ్ళ ముందు నిజమై కనపడుతున్నాయి. అప్పుడు కమల్ చెప్పిన కాన్సెప్ట్ కి నవ్వినవారే ఇప్పుడు జై అంటున్నారు. అంతే కాలం, మార్పులు అనేవి మనిషి చేతిలోనో నియంత్రణలోనో ఉండేవి కాదు. సినిమా పరిశ్రమకు సంబంధించి ఇదే ఉత్తమ ఉదాహరణ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp