బుకింగ్స్ బాగున్నాయి : ట్రేడ్ లో ఆనందం

By iDream Post Dec. 02, 2020, 08:17 pm IST
బుకింగ్స్ బాగున్నాయి : ట్రేడ్ లో ఆనందం

ఎనిమిది నెలలుగా ఎదురు చూస్తున్న ఘడియలు ఇంకో రెండు రోజుల్లో రాబోతున్నాయి. థియేటర్ల గేట్లు తెరుచుకుని ప్రేక్షకులకు స్వాగతం పలకబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లాంటి కీలక నగరాలకు చెందిన మల్టీ ప్లెక్సుల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టేశారు. 50 శాతం ఆక్యుపెన్సీనే అయినప్పటికీ రెస్పాన్స్ బాగుంది. అందరిని ఎక్కువగా ఆకట్టుకుంటున్న సినిమా హాలీవుడ్ నుంచి రాబోతున్న టెనెట్. ఆన్ లైన్లో పైరసీ రూపంలో దీని హెచ్డి వెర్షన్ వచ్చేసినప్పటికీ ఆడియన్స్ మాత్రం బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కోసం టికెట్లను పోటీపడి మరీ బుక్ చేసుకుంటున్నారు. రానా సైతం మహేష్ బాబు సూపర్ ప్లెక్స్ లో ఈ సినిమా చూసేందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని చెప్పడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

టెనెట్ తో పాటు ట్రోల్స్ వరల్డ్ టూర్, పెనిన్సులా, ది న్యూ మ్యుటెంట్స్, కం ప్లే లాంటి ఇతర హాలీవుడ్ మూవీస్ కూడా అదే రోజు రాబోతున్నాయి. వీటికి సైతం బుకింగ్ బాగానే ఉంది. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే అర్జున్ రెడ్డి, ఇస్మార్ట్ శంకర్, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్స్ ని స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇవి ఇటీవలే టీవీలో సైతం వచ్చిన చిత్రాలు కావడంతో టికెట్ తెగుతున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ దిల్వాలే దుల్హనియా లేజాయేంగే పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.

అన్నింటిలోకి టెనెట్ టాప్ బుకింగ్స్ తో దూసుకుపోతోంది. ఇతర దేశాల్లో నెలల క్రితమే విడుదలైన టెనెట్ కు మరీ అద్భుతమైన రెస్పాన్స్ రానప్పటికీ క్రిస్టోఫర్ నోలన్ అభిమానులు దీన్ని వెండితెరమీదే చూడాలని గట్టిగా ఫిక్సయిపోయారు. అందుకే తెలుగు వెర్షన్ కంటే ఇంగ్లీష్ వెర్షన్ కే ఎక్కువ హౌస్ ఫుల్స్ పడబోతున్నాయి. అయితే ఈ జోరు ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. కొత్త సినిమాలు వేయాలే కానీ ప్రేక్షకులు ఖచ్చితంగా వస్తారని టెనెట్ రుజువు చేస్తోంది. క్రిస్మస్ రోజున రాబోతున్న సోలో బ్రతుకే సో బెటరూ నిర్మాతలు నిశ్చింతగా ఓపెనింగ్స్ మీద ధీమాగా ఉండొచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp