థాంక్ యు బ్రదర్ రివ్యూ

By iDream Post May. 07, 2021, 07:23 am IST
థాంక్ యు బ్రదర్ రివ్యూ

గత ఏడాది లాగే ఈసారి కూడా కరోనా వల్ల థియేటర్లు మూతబడటంతో మళ్ళీ డిజిటల్ రిలీజుల ప్రవాహం మొదలయ్యింది. నేరుగా ఇంట్లోనే కూర్చుని ఎంచక్కా కొత్త సినిమాలను చూసే వెసులుబాటుని ప్రేక్షకులు మరోసారి ఎంజాయ్ చేయబోతున్నారు. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ ఉన్న మూవీ ఏదీ రాకపోవడంతో ఉన్నంతలో థాంక్ యు బ్రదర్ మీద జనానికి అంతో ఇంతో అంచనాలు ఉన్నాయి. అందులోనూ యాంకర్ అనసూయ కీలక పాత్ర పోషించడం, ట్రైలర్ లో దీన్నో డిఫరెంట్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ప్రెజెంట్ చేయడంతో ఓ మాదిరి హైప్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అభి(విరాజ్ అశ్విన్)ఏ మాత్రం బాధ్యత లేకుండా విచ్చలవిడిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ తల్లి(అర్చన అనంత్)ని బాధ పెడుతూ ఉంటాడు. ఓసారి పబ్బులో బిల్లు కట్టేందుకు డబ్బులు లేక కార్డు బ్లాక్ అవ్వడంతో ఇల్లు వదిలి బయటికి వస్తాడు. ఓ పని మీద అపార్ట్ మెంట్ కు వెళ్ళినప్పుడు తనతో పాటు గర్భిణి ప్రియా(అనసూయ)తో కలిసి చెడిపోయిన లిఫ్ట్ లో ఇరుక్కుంటాడు. భర్త చనిపోయిన ప్రియకు నొప్పులు ఎక్కువవుతాయి. దీంతో ఆమెకు డెలివరీ చేయాల్సిన బాధ్యత అభి మీద పడుతుంది. ఆ లిఫ్ట్ లో ఏం జరిగింది. అభి ప్రియాల మధ్య ఎలాంటి బాండింగ్ ఏర్పడింది అనేదే అసలు స్టోరీ

నటీనటులు

విరాజ్ అశ్విన్ ఒళ్ళంతా పొగరు మదం ఎక్కిన కుర్రాడిగా బాగానే చేశాడు. బరువైన ఎమోషన్స్ పలికించాల్సిన సీన్స్ లో కొంత తడబడినప్పటికీ ఫైనల్ గా మంచి రూపంతో పాటు నటనలోనూ పర్వాలేదు అనిపిస్తాడు. ఈ సినిమాను తన భుజాల మీద ప్రమోట్ చేసిన అనసూయకు ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. అత్యద్భుతమైన పాత్రని చెప్పలేం కానీ ఇంత కన్నా బెస్ట్ ఛాయస్ కష్టమనేలా మెప్పించింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సహజసిద్ధమైన ఎక్స్ ప్రెషన్లతో తన అనుభవాన్ని ప్రదర్శించింది.

అన్నపూర్ణమ్మ గారు ఓకే కానీ మధ్యలో కీలకమైన భాగమంతా మాయం కావడం ఆశ్చర్యపరుస్తుంది. అభి తల్లిగా అర్చన అనంత్ క్యారెక్టర్ కు తగ్గట్టు సెట్ అయ్యారు. అనీష్ కురువిల్లా పాత్రలో ఎలాంటి ప్రత్యేకత లేదు. ఆయనా ఏదో మొక్కుబడిగా అన్నట్టు చేసుకుంటూ పోయారు. మౌనిక రెడ్డి, వైవా హర్ష, సమీర్, కాదంబరి కిరణ్, రాఘవేంద్ర తదితరులు అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవాళ్ళే. ప్రత్యేకంగా చెప్పుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి ఏమి లేదు. చిన్న రోల్స్ కి కనీస అనుభవం లేని వాళ్ళను తీసుకోవడం కొంత మైనస్ అయ్యింది

డైరెక్టర్ అండ్ టీమ్

పేపర్ మీద బాగుందనిపించిన ప్రతి లైన్ సినిమా మెటీరియల్ కాలేదు. థాంక్ యు బ్రదర్ కూడా అంతే. చాలా చిన్న పాయింట్ ని తీసుకుని దర్శకుడు రమేష్ రాపర్తి చేసిన ప్రయత్నం మంచిదే కానీ ఇలాంటి కథల్లో బలంగా పండాల్సిన ఎమోషన్ మీద ఎక్కువ వర్క్ చేయకపోవడంతో ఇంతేనా అనే ఫీలింగ్ కలుగుతుంది. డెలివరీ లాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు హీరో దాన్ని ఎలా ఎదురుకుంటాడు అనే ఎపిసోడ్ తో గతంలో 3 ఇడియట్స్, భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాల్లో అద్భుతమైన భావోద్వేగాలు పండాయి. కానీ థాంక్ యు బ్రదర్ లో మిస్ అయ్యింది ఇదే. సింపుల్ గా ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది.

ప్రియా ట్రాక్ వరకు బాగానే డిజైన్ చేసుకున్న రమేష్ రాపర్తి అసలైన అభి సెటప్ ని మాత్రం రిజిస్టర్ అయ్యేలా రాసుకోలేదు. పాత్రల పరిచయానికి సుమారు 50 నిమిషాల దాకా సమయం తీసుకోవడంతో అసలు కథ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. తీరా అది మొదలయ్యాక ఎక్కడా థ్రిల్ అనిపించకుండా ఏదో అలా అలా వెళ్లిపోవడంతో ఎండ్ కార్డు పడ్డాక ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. పాత్రల మధ్య రిలేషన్ ని ఇంకాస్త బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే వాటి తాలూకు ఫీలింగ్స్ ప్రేక్షకులను తాకి ప్రభావం పెరిగేది. కానీ ఫారిన్ సినిమాను స్ఫూర్తిగా తీసుకున్న రమేష్ రాపర్తి ఎక్కువ లోతుగా ఆలోచించలేదు.

ఇలాంటి రియలిస్టిక్ కథల్లో లాజిక్స్ ని చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న వాటికి కూడా లక్షలాది అనుమానాలు వస్తాయి. అభి ప్రియాలు లిఫ్ట్ లో ఇరుక్కున్నాక పేరున్న టీవీ ఛానల్స్ లో అదంతా లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు పోలీసులు మాత్రం ఎందుకు రారనే ప్రశ్నకు డైరెక్టర్ ఎక్కడైనా జవాబు చెప్పి ఉంటే బాగుండేది. అంతేకాక వీళ్ళను కాపాడేందుకు హీరో తండ్రి తప్ప ఇంకెవరు రాకూడదు అనేలా సెట్ చేసుకున్న స్క్రీన్ ప్లే కూడా అతకలేదు. ఎక్కడో దూరం నుంచి అతన్ని రప్పించడం కన్నా దగ్గరలో ఉన్న హాస్పిటల్ నుంచి ఎవరి సహాయం అయినా పొందవచ్చు కదా అనే తర్కం రచయితలు ఎందుకు ఆలోచించలేదో.

ఈ స్టోరీని సినిమాటిక్ గా చెప్పాలని రమేష్ రాపర్తి చేసిన ప్రయత్నమే పైన చెప్పిన లాజిక్స్ అన్నీ బయట పడేలా చేసింది. ఎక్కడికక్కడ కన్విన్స్ చేసే కథనం రాసుకోకపోగా పాత్రలు ఎలా ప్రవర్తించాలో ముందే డిసైడ్ చేసుకుని దానికి తగ్గ సన్నివేశాలు రాసుకువడంతో లోపాలన్నీ హై లైట్ అయ్యాయి. ఏదో యూత్ కోసం స్టార్టింగ్ లో పెట్టిన ఓ బోల్డ్ సీన్ కూడా అవసరం లేనిదే. అలా అని థాంక్ యు బ్రదర్ మరీ బ్యాడ్ ప్రోడక్ట్ అని చెప్పడం కాదు ఉద్దేశం.చాలా తక్కువ బడ్జెట్ లో టేకింగ్ పరంగా ఓకే అనిపించుకున్నా కూడా మంచి అవకాశం ఇలా అయ్యిందే అని చెప్పాలన్నదే మా ప్రయత్నం.

గుణ బాలసుబ్రమణియన్ సంగీతం ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరీ గొప్పగానూ లేదు అలా అని చప్పగానూ లేదు. ఏదో ఎమోషన్ కోసం పెట్టిన పాటలు వల్ల కలిగిన ప్రయోజనం శూన్యం. సురేష్ రగుటు ఛాయాగ్రహణం బడ్జెట్ అడ్డంకులను అతి కష్టం మీద దాటుకుంటూ క్వాలిటీ ఇచ్చేందుకు గట్టిగానే కష్టపడింది. తన వరకు వంక పెట్టడానికి ఏమి లేదు. ఉదయ్-వెంకట్ ల ఎడిటింగ్ కూడా ఓకే. గంటన్నర నిడివిలో ఇంకా కోత అడిగితే ఇది షార్ట్ ఫిలిం అయిపోతుంది. రమేష్ రాపర్తి, సురేంద్ర బాబు సంభాషణలు పర్వాలేదు. మెరుపులేమి లేవు. నిర్మాతలు చాలా చాలా తక్కువ బడ్జెట్ లో కానిచ్చేశారు

ప్లస్ గా అనిపించేవి

అనసూయ నటన
డిఫరెంట్ స్టోరీ లైన్
తక్కువ నిడివి

మైనస్ గా తోచేవి

ప్రెజెంటేషన్
ఆశించినంత ట్విస్టులు లేకపోవడం
ఫ్లాట్ స్క్రీన్ ప్లే
ఎమోషన్స్

కంక్లూజన్

గత నెల కరోనా ఉదృతి మళ్ళీ పెరిగినప్పుడు థియేటర్లలో విడుదల చేద్దామనుకుని డ్రాప్ అయిన థాంక్ యు బ్రదర్ ఓటిటిలో వచ్చి చాలా మంచి పని చేసింది. టికెట్ కొని సమయాన్ని ఖర్చు పెట్టి హాలు దాకా వచ్చేంత కంటెంట్ ఇందులో లేదు. మేకర్స్ కూడా ఆ ఉద్దేశంతో తీసినట్టు ఉన్నారు కాబట్టి ఆ కోణంలో చూస్తే థాంక్ యు బ్రదర్ జస్ట్ ఓకే అనిపిస్తుంది తప్ప వావ్ అనే అవకాశాన్ని దర్శకుడు రమేష్ రాపర్తి ఇవ్వలేదు. అనసూయ కోసం చూద్దామన్నా ఆ ఒక్క కారణంగా దీన్ని బలంగా రికమండ్ చేయలేం కానీ ఉన్నంతలో వేరే ఆప్షన్స్ పెద్దగా లేవు కాబట్టి మరీ బోర్ కొడుతుంటే మాత్రం జీరో అంచనాలతో జస్ట్ ఒక లుక్ వేయొచ్చు

ఒక్క మాటలో - అంత లేదు బ్రదర్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp