తాండవ్ వివాదాలకు కారణాలు

By iDream Post Jan. 19, 2021, 03:51 pm IST
తాండవ్ వివాదాలకు కారణాలు

వెబ్ సిరీస్ లకూ సైతం సెన్సార్ షిప్ ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఆ మధ్య ప్రభుత్వం కొన్ని నియమనిబంధనలు తీసుకొచ్చింది కానీ అవి ఇంకా అమలు కాలేదు. ఈలోగా వివాదాలు ముసురుకుంటున్నాయి. సంక్రాంతికి అమెజాన్ ప్రైమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన తాండవ్ ఇప్పుడు తీవ్ర కాంట్రోవర్సీకి దారి తీస్తోంది. అందులో హిందూ దేవుళ్లను అవమానించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, వీటి వల్ల మనోభావాలు దెబ్బ తిని వైషమ్యాలు పొడసూపే ప్రమాదం ఉందని ఇప్పటికే యపి తదితర రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లలో పలు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

ఇంతకీ అసలు సమస్య ఎక్కడ వచ్చిందనే దాని గురించి సిరీస్ చూసినవాళ్లకు తప్ప అవగాహన లేదు. అదేంటో చూద్దాం. ఇందులో నటుడు మొహమ్మద్ జీషాన్ అయ్యుబ్ ఓ కీలకమైన సీన్ లో శివుడి పాత్రధారిగా కనిపిస్తాడు. మాడరన్ డ్రెస్సులో చేతిలో త్రిశూలం పట్టుకుని మొహం మీద నీలి రంగు వేసుకుని తనకు సోషల్ మీడియాలో ఫాలోయర్స్ తక్కువగా ఉన్నారని ఓ స్టేజి మీద వాపోతాడు. దానికి బదులుగా మరో పాత్రధారి చెప్పిన డైలాగులు యూనివర్సిటీల్లో చదివే విద్యార్థుల మీద సెటైరిక్ గా సాగుతాయి. మరో సన్నివేశంలో ఓ దళిత అబ్బాయి ఉన్నత వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం గురించి ఆక్షేపణీయమైన సంభాషణలు ఉన్నాయి.

ఇప్పుడీ ఎపిసోడ్లే ఇంత రచ్చకు కారణమయ్యాయి. ప్రధాన పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ తో పాటు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఇళ్ల వద్ద పోలీస్ సెక్యూరిటీ పెంచారు. అయితే అమెజాన్ తరఫున ఎలాంటి క్షమాపణ రాలేదు కానీ టీమ్ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేయలేదని సారీ చెబుతోంది. కనీస విచక్షణ లేకుండా ఇలాంటి సిరీస్ లు ఎలా తీస్తారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇంతా చేసి తాండవ్ కు వచ్చిన రివ్యూలు చాలా నెగటివ్ గా ఉన్నాయి. సాగతీతతో పొలిటికల్ థ్రిల్లర్ పేరుతో టార్చర్ పెట్టారనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. మరి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp