మెగాస్టార్ సినిమాకు తమన్ సంగీతం : అఫీషియల్

By iDream Post Jan. 20, 2021, 02:42 pm IST
మెగాస్టార్ సినిమాకు తమన్ సంగీతం : అఫీషియల్

ఈమధ్య కాలంలో భీభత్సమైన ఫామ్ లో ఉన్న సంగీత దర్శకుడు తమన్ సుడి మాములుగా లేదు. రాకెట్ స్పీడ్ తో ఎక్కడికో దూసుకెళ్ళిపోతోంది. అల వైకుంఠపురములో దెబ్బకు ఇంత బాషల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చి పడే స్థాయికి యమా బిజీ అయిపోయాడు. ట్యూన్లు కాపీ అంటూ ఎలాంటి విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా తను మాత్రం స్పీడ్ ని స్కోర్ ని పెంచేస్తున్నాడు. తెలుగులో నిర్మాణంలో ఉన్న పది భారీ సినిమాల్లో కనీసం ఆరింటికి తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండటం అతిశయోక్తి కాదు. ఇప్పుడు తాజాగా మరో మెగా ఆఫర్ తన ఖాతాలో వేసుకుని మబ్బుల్లో తేలిపోతున్నాడు.

చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందబోయే లూసిఫర్ రీమేక్ కు తమన్ సంగీతం సమకూర్చబోతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా అఫీషియల్ గా ట్వీట్ చేసి మరీ సంతోషాన్ని పంచుకున్నాడు. తన కల నిజం కాబోతోందని ఆనందం వ్యక్తం చేశాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ తో పాటు అయ్యప్పనుం కోషియం రీమేక్ లు తన ఖాతాలో వేసుకున్న తమన్ ఇప్పుడు అన్నయ్య చిరు ప్రాజెక్ట్ కూడా రావడం అంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. తమన్ ఫ్యాన్స్ మాత్రం పిచ్చ హ్యాపీగా ఉన్నారు. మెగాభిమానులు సైతం సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు.

ఆచార్య తర్వాత చిరు చేయబోతున్న సినిమాగా లూసిఫర్ రీమేక్ మీద షూటింగ్ మొదలుకాకుండానే అంచనాలు ఎక్కువయ్యాయి. ఇప్పటిదాకా క్యాస్టింగ్ కు సంబంధించి నయనతార, సత్యదేవ్ పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. వాళ్ళ పాత్రల స్వభావాలు కూడా సస్పెన్సు గానే ఉన్నాయి. సో థమన్ మొత్తానికి మెగా కాంపౌండ్ లో గట్టిగానే పాతుకుంటున్నాడు. సోలో బ్రతుకే సో బెటరూ తర్వాత ఇప్పుడు పవన్ రెండు సినిమాలు, వరుణ్ తేజ్ గనితో పాటు ఇప్పుడు తాజాగా మెగా మూవీనే పట్టేశాడు. మ్యూజిక్ సిటింగ్స్ కూడా మొదలైపోయాయని ట్వీట్ ని బట్టి అర్థమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp