నన్ను ఆపతరమా అంటున్న తమన్

By Ravindra Siraj Jan. 18, 2020, 11:13 am IST
నన్ను ఆపతరమా అంటున్న తమన్

గత ఏడాది ప్రధమార్థంలో సంగీత సంచలనం తమన్ మీద కొన్ని కామెంట్లు. రిపీట్ మ్యూజిక్ ఇస్తున్నాడని, ట్యూన్స్ పరంగా పెద్దగా ఆకట్టుకోవడం లేదని, దేవిశ్రీ ప్రసాద్ కు ధీటుగా అవుట్ పుట్ ఇవ్వడం లేదని ఇలా ఏవేవో మాటలు వినిపించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో మునుపటి తమన్ ఏమయ్యాడంటూ సంగీత ప్రియులు నేరుగా అడిగేసిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇదంతా గతం. ఇప్పుడు తమన్ లెక్క వేరుగా ఉంది. హీరో ఎవరైనా దర్శకుడు ఎవరైనా తనవరకు బెస్ట్ ఇచ్చేస్తున్నాడు.

కొత్త కొత్త ప్రయోగాలతో తమన్ ఈజ్ బ్యాక్ అనిపిస్తూ మరోసారి దూసుకుపోతున్నాడు. అల వైకుంఠపురములో సక్సెస్ వెనుక తమన్ పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామజవరగమనా, రాములో రాములో పాటలు వందల మిలియన్ల వ్యూస్ సాధించి లిరికల్ వీడియోస్ తోనే పెను దుమారం రేపాయి. నిన్న విడుదలైన సిత్తరాల సిరపడు ఆల్రెడీ రికార్డులు బద్దలు కొట్టే దిశగా వెళ్తోంది. నిజానికి తమన్ ఇప్పటితరంలో అత్యంత వేగంగా వీలైనంత ఎక్కువ సినిమాలకు క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వడంలో పేరు తెచ్చుకున్న వాడు.

కేవలం రెండు నెలల కాలంలో ప్రతి రోజు పండగే, వెంకీ మామ, అల వైకుంఠపురములో రూపంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేశాడు. గత ఏడాది మజిలి లాంటి ఫీల్ గుడ్ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి దాని విజయంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు తొలిప్రేమ, అరవింద సమేత వీర రాఘవలతో తమన్ తన ఫ్లోని కొనసాగిస్తూనే వచ్చాడు.

కాకపోతే మధ్యలో వచ్చిన కొన్ని కమర్షియల్ ఫెయిల్యూర్స్ తమన్ కు స్పీడ్ బ్రేకర్స్ గా అడ్డుపడినప్పటికి వాటిని పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తమన్ నెక్స్ట్ చేస్తున్న లిస్టు లో సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, నాని టక్ జగదీశ్, రవితేజ క్రాక్, కీర్తి సురేష్ మిస్ ఇండియా లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఇళయరాజా, మణిశర్మ లాంటి వాళ్ళు ఎంజాయ్ చేసిన సక్సెస్ స్ట్రీక్ ని ఇప్పటి తరంలో వంద సినిమాలు వేగంగా పూర్తి చేసిన తమన్ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాడన్నది వాస్తవం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp