బ్యాచిలర్ కోసం ప్రత్యేకమైన అతిథి

By iDream Post Aug. 09, 2020, 07:56 pm IST
బ్యాచిలర్ కోసం ప్రత్యేకమైన అతిథి

అక్కినేని అఖిల్ నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ 2021 సంక్రాంతికి టార్గెట్ చేసుకుని పనులు జరుపుకుంటోంది. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ రీ స్టార్ట్ కాకపోయినా ఇప్పటిదాకా పూర్తైన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేశారు. పెద్ద సినిమాలేవీ పండగ బరిలో నిలిచే అవకాశాలు లేకపోవడంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని గీతా ఆర్ట్స్ గట్టి స్కెచ్ వేసింది. ఇదిలా ఉండగా దీనికి సంబంధించి ఒక కీలకమైన లీక్ ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దాని ప్రకారం ఇందులో సమంతా ఒక కీలకమైన క్యామియో చేసిందట. బొమ్మరిల్లులో సిద్దార్థ్ ఎలా అయితే తన కథను ఓ లేడీకి చెబుతాడో ఇందులో కూడా అచ్చం అలాగే అఖిల్ సమంతాకు తన బాధను వివరిస్తాడట.

సామ్ రోల్ అంతకే పరిమితమవుతుండా లేక ఇంకేమైనా అదనపు సన్నివేశాలు ఉన్నాయా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వదినతో అఖిల్ నటించడం ఇది మొదటిసారి కాదు. మనంలో చేశారు కానీ అది కేవలం కొన్ని సెకండ్లకే పరిమితమయ్యారు. అందులోనూ కాంబినేషన్లో ఎలాంటి డైలాగ్స్ ఉండవు. ఇప్పుడీ వార్త కనక నిజమైతే బ్యాచిలర్ కు ప్రత్యేక ఆకర్షణ తోడైనట్టే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. అఖిల్ చేసిన మూడు ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడంతో ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నారు.

పూజా హెగ్డే హీరొయిన్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో పాటు ఎమోషన్స్ తో రూపొందుతోందట. ఇక గత ఏడాది మావయ్య మన్మధుడు 2లో అలా మెరిసిన సమంతా ఇప్పుడు మరిదికి హెల్ప్ చేయడం విశేషం. వచ్చే నెల నుంచి బాలన్స్ పార్ట్ తీసే ఛాన్స్ ఉంది. పూజా హెగ్డే డేట్స్ తో ముడిపడిన విషయం కావడంతో ఇంకా డేట్స్ ఫైనల్ చేయలేదు. కరోనా మహమ్మారి వల్ల ఏ సినిమాను ఫలానా తేది నుంచి అని ప్లాన్ చేయలేకపోతున్నారు. అందుకే కన్ఫ్యూజన్ అలాగే కొనసాగుతోంది. ఒకవేళ అన్ని అనుకున్నట్టుగా సాగితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు సంక్రాంతి సీజన్ వసూళ్ళ పరంగా చాలా పెద్ద అడ్వాంటేజ్ గా మారుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp