'బిగ్ బుల్'ని టెన్షన్ పెడుతున్న 'స్కామ్'

By iDream Post Dec. 03, 2020, 06:25 pm IST
'బిగ్ బుల్'ని టెన్షన్ పెడుతున్న 'స్కామ్'

అదేంటి సినిమాలు వెబ్ సిరీస్ వేరు వేరు కదా ఇలా ప్రభావం చూపించడం ఏమిటనుకుంటున్నారా. మ్యాటర్ చదివితే మీకే అర్థమవుతుంది. లాక్ డౌన్ వల్ల జనం ఏ స్థాయిలో డిజిటల్ కంటెంట్ కు అలవాటు పడ్డారో కళ్లారా చూస్తూనే ఉన్నాం. థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటిటిలో డైరెక్ట్ రిలీజుల ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ రెండు మధ్య పోటీ అంటేనే కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఇది నిజం. అదెలాగో మీరే చూడండి. అక్టోబర్లో సోనీ లివ్ యాప్ లో విడుదలైన స్కామ్ 1992 వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. పది ఎపిసోడ్లతో సుమారు తొమ్మిది గంటల నిడివికి ప్రేక్షకులు విసుక్కోకుండా జై కొట్టారు.

ఇది ఏ స్థాయి హిట్ అంటే సోనీ లివ్ కు రోజుల వ్యవధిలోనే లక్షల సబ్స్క్రైబర్స్ పెరిగారు. 90వ దశకంలో దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన స్టాక్ మార్కెట్ స్కామ్ సూత్రధారి హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా రూపొందిన స్కామ్ 1992ని దర్శకుడు హన్సల్ మెహతా తీర్చిదిద్దన విధానం క్రిటిక్స్ ని సైతం మెప్పించింది. ప్రధాన పాత్రలో నటించిన ప్రతీక్ గాంధీకి లెక్కలేనన్ని ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. ఏకంగా సినిమా ఆఫర్లను దక్కించుకుంటున్నాడు. ఇటీవలే ఈ స్కామ్ 1992ని తెలుగుతో పాటు తమిళ్ మలయాళంలోకి అనువదించి విడుదల చేశారు. దీంతో ఆదరణ ఇంకా పెరిగింది.

ఇక సినిమా విషయానికి వస్తే ఇదే కథతో హర్షద్ మెహతా పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించగా కూకీ గులాటి దర్శకత్వంలో రూపొందిన ది బిగ్ బుల్ త్వరలో డిస్నీ హాట్ స్టార్ ద్వారా త్వరలో రిలీజ్ కాబోతోంది. నిజానికి దీన్ని నవంబర్ లోనే ప్లాన్ చేసుకున్నారు. కానీ స్కామ్ 1992కి వచ్చిన స్పందన చూసి లేనిపోని పోలికలతో బిగ్ బుల్ ని ఇబ్బంది పెడతారేమోనని భావించిన హాట్ స్టార్ దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పటికీ డేట్ ఫైనల్ కాలేదు. స్కామ్ 92ని అందరూ మర్చిపోయేదాకా వేచి చూడాలనుకుంటున్నారు కాబోలు. మొత్తానికి ఒక వెబ్ సిరీస్ దెబ్బకు ఏకంగా సినిమాని పోస్ట్ పోన్ చేయడం విచిత్రమే. బిగ్ బుల్ లో ఇలియానా ఓ కీలక పాత్ర చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp