సర్కారు వారి ప్లాను మారింది

By iDream Post Nov. 24, 2020, 03:04 pm IST
సర్కారు వారి ప్లాను మారింది

ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అతి త్వరలో అమెరికా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ముందు అనుకున్న ప్రకారం టీమ్ జనవరిలో వెళ్ళాలి. కానీ ఇప్పుడు అందులో మార్పు జరిగినట్టు సమాచారం. కొందరు సభ్యులకు వీసా సమస్య రావడంతో పాటు యుఎస్ లో కరోనా సెకండ్ వేవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో నిర్ణయం మార్చుకున్నట్టుగా తెలిసింది. దీని బదులు ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసినట్టుగా వినికిడి. టైం వేస్ట్ కాకుండా హైదరాబాద్ లో ఇక్కడి లొకేషన్స్ అవసరమయ్యే సన్నివేశాలు, పాటలు తీయబోతున్నారు.

ఇది అధికారికంగా ప్రకటించింది కాకపోయినా మొత్తానికి పరిమాణం ఆసక్తికరంగా ఉంది. గీత గోవిందం తర్వాత ఏకంగా మూడేళ్ళ గ్యాప్ వచ్చిన దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాటతో బిగ్ లీగ్ లోకి వెళ్లే ప్రణాళికలో ఉన్నాడు. ఇది కనక సరిగ్గా పడితే కొరటాల శివ తరహాలో స్టార్లే తనవెనుక పడేలా చేసుకోవచ్చు. అందుకే స్క్రిప్ట్ తో మొదలుకుని లొకేషన్స్ దాకా అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాలను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని ఎవరూ ఊహించని రీతిలో మహేష్ క్యారెక్టర్ ని డిజైన్ చేయించారట. డ్యూయల్ రోల్ అని కూడా ఒక ప్రచారం ఉంది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సర్కారు వారి పాటకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. దూకుడు, బిజినెస్ మెన్ లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చిన కాంబినేషన్ కావడంతో అంచనాలు ఎక్కడ ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా 2022 సంక్రాంతికి వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ షూటింగ్ ఆరు నెలల్లో పూర్తి చేస్తే 2021 దసరా లేదా దీపావళికి ఆశించవచ్చు. అలా కాకుండా ఏదైనా ఆలస్యం జరిగితే సరిలేరు నీకెవ్వరు వచ్చిన రెండు సంవత్సరాలకు మహేష్ మూవీ రిలీజ్ అయినట్టు అవుతుంది. లాక్ డౌన్ వల్ల ప్రిన్స్ అభిమానులు ఎక్కువ కాలం వేచి చూడక తప్పడం లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp