సత్తా చాటిన సంక్రాంతి సినిమా

By iDream Post Jan. 18, 2021, 04:39 pm IST
సత్తా చాటిన సంక్రాంతి సినిమా

ఎన్నో అనుమానాలు. ఎన్నెన్నో భయాలు. సగం సీట్లతో థియేటర్లు. జనాల్లో పూర్తిగా తొలగని భయాలు. బాలీవుడ్ లో ఏ ఒక్క నిర్మాత కనీసం తమ సినిమా రిలీజ్ డేట్లను ప్రకటించేందుకు కూడా వెనుకాడుతున్న తరుణం. ఒక్క తెలుగు పరిశ్రమ మాత్రమే సై అంటే సై అంటూ కరోనాతో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యింది. ఏ భాషలో లేని విధంగా మూడు స్ట్రెయిట్ సినిమాలు, ఒక డబ్బింగ్ మూవీతో ఎగ్బిటర్ల మొహంలో నవ్వులను, ప్రేక్షకుల ముంగిట్లో వినోదాన్ని అందించేందుకు అన్ని రకాల రిస్కులకు రెడీ అంది. రెవిన్యూ పోతుందని తెలిసినా సరే ఎవరో ఒకరు ముందడుగు వేయాలనే స్ఫూర్తిని అందరికీ ఇచ్చింది. ఇప్పుడు అదే అద్భుత ఫలితాలను ఇస్తోంది.

2021 సంక్రాంతి సందడి నిన్నటితో పూర్తయ్యింది. మొత్తం నాలుగు సినిమాలు వచ్చాయి. రవితేజ క్రాక్ కి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాగా ఇప్పటిదాకా ఎనిమిది రోజులకు గాను సుమారు 23 కోట్ల దాకా షేర్ రాబట్టి ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. టార్గెట్ పెట్టుకున్న 18 కోట్లను చాలా తేలికగా దాటేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన విజయ్ మాస్టర్ టాక్ పరంగా నిరాశపరిచినప్పటికీ కేవలం అయిదు రోజుల్లో 11 కోట్లకు పైగా షేర్ తెచ్చుకుని బయ్యర్స్ దృష్టిలో సూపర్ సేఫ్ అనిపించుకుంది. జరిగిన బిజినెస్ 9 కోట్ల లోపే కావడంతో ఇప్పటికే లాభాలు మొదలైపోయాయి. ఈ రోజు నుంచి పరిస్థితి ఎలా ఉండబోతోందో చూడాలి.

ఇక ఏడాది పాటు వేచి చూసి థియేట్రికల్ రిలీజ్ చేసుకున్న రామ్ రెడ్ కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం డీసెంట్ గా ఉన్నాయి. మొదటిరోజే 6 కోట్లకు పైగా షేర్ వచ్చిందని స్వయంగా రామే ట్వీట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. అటుఇటుగా నాలుగు రోజులకు గాను పన్నెండు కోట్ల దాకా వచ్చి ఉండొచ్చని అంటున్నారు కానీ ఇంకా ఫిగర్స్ తెలియాల్సి ఉంది. ఇక దారుణమైన రిపోర్ట్స్ వచ్చిన అల్లుడు అదుర్స్ సైతం మాస్ ఆడియన్స్ అండతో బాగానే రాబడుతోంది. బెల్లకొండ సురేష్ పబ్లిక్ స్టేజి మీదే లెక్కలు చెప్పి మరీ తమ సినిమా ఎంత పెద్ద హిట్టో చెప్పారు. నిన్నటివరకు కలెక్షన్లు బాగానే ఉన్నాయి మరి. మొత్తానికి సంక్రాంతి ఈ ఏడాదికి సరిపడా కొండంత ధైర్యాన్ని, అండను ఇచ్చింది. వంద శాతం సీటింగ్ అనుమతులు రావడమే ఆలస్యం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp