కొనసాగుతున్న బిగ్ బాస్ సస్పెన్స్ :యాంకర్ తనేనా?

By iDream Post Oct. 22, 2020, 03:42 pm IST
కొనసాగుతున్న బిగ్ బాస్ సస్పెన్స్ :యాంకర్ తనేనా?

శనివారం, ఆదివారం ప్రసారం కావాల్సిన ఎపిసోడ్స్ తాలూకు బిగ్ బాస్ 4 షూటింగ్ రేపే చేయాలి. అక్కడ మనాలిలో వైల్డ్ డాగ్ షూటింగ్ లో ఉన్న నాగార్జున తిరిగి వచ్చే సూచనలు తక్కువగా ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ వెళ్లేంత అనుకూలంగా వాతావరణం లేదు. అందులోనూ ఎంత ఫిట్ గా ఉన్నా ఏజ్ ని కూడా నాగ్ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే వీలైనంత వేగంగానే దర్శకుడు అహిషోర్ సాల్మన్ చిత్రీకరణ జరుపుతున్నట్టు సమాచారం. మరి వీకెండ్ లో వచ్చే రెండు ఎపిసోడ్లకు ఎవరు యాంకరింగ్ చేస్తారనే అనుమానం కలగడం సహజం. మొన్నటిదాకా రమ్యకృష్ణ, రోజా రెండు పేర్లు వినిపించాయి. దాన్ని సమర్ధిస్తూ ఖండిస్తూ ఎలాంటి ప్రకటనలు రాలేదు. ఇక ఈ సిరీస్ లో మొదటిసారి సినిమా గెస్ట్ గా ఆరెక్స్ 100 కార్తికేయ రాబోతున్నట్టు కూడా లీక్ వచ్చింది. నిజమో కాదో ఇంకా తెలియాల్సి ఉంది.

తాజా అప్డేట్ ప్రకారం సమంతాతో దీన్ని చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్టు సమాచారం. అయితే తాను సమర్ధవంతంగా డీల్ చేయగలదా అనేదే అనుమానం. ఎందుకంటే ఇప్పటికీ సినిమాలకు తనే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేదు సామ్. ఒకటి రెండు ప్రయత్నాలు చేసింది కానీ అవి అంతగా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఓ బేబీకి చిన్మయినే తీసుకోవాల్సి వచ్చింది. మరి గంటకు పైగా సాగే యాంకరింగ్ షోని సామ్ ఎలా రన్ చేస్తుందన్నది పెద్ద ప్రశ్నే. అందులోనూ వీకెండ్ కాబట్టి ఎలిమినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఒకరినో ఇద్దరినో సాగనంపాలి.

కానీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం దసరా పండగ సందర్భంగా ఈ వారాంతంలో ఎవరినీ పంపకపోవచ్చు అంటున్నారు. నాగార్జున వస్తే హ్యాపీ. లేదూ ఇంకెవరైనా వచ్చినా కూడా వాళ్ళతో జస్ట్ షో నడిపించి సభ్యులను సాగనంపే ప్రోగ్రాం మాత్రం ఈసారి పెట్టరట. మూడో సీజన్ లోనూ నాగ్ కు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రమ్యకృష్ణ వచ్చి చక్కగా డీల్ చేసింది. మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అసలే రేటింగ్స్ కోసం కిందా మీద పడుతూ బిగ్ బాస్ ఆపసోపాలు పడుతోంది. ముఖ్యంగా వీక్ డేస్ లో సాగుతున్న తీరు ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వడం లేదు. రేపు ఉదయం లోపే ఈ సస్పెన్స్ విడిపోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp