కండల వీరుడి క్షమాపణలు

By iDream Post May. 12, 2021, 12:00 pm IST
కండల వీరుడి క్షమాపణలు

అవును బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సారీ చెప్పాడు. ప్రేక్షకులకు కాదు లెండి. థియేటర్ ఓనర్లకు. రేపు విడుదల కాబోతున్న రాధే ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఆన్ లైన్ లో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ఎగ్జిబిటర్లకు కండల వీరుడు క్షమాపణ చెప్పాడు. థియేటర్లలో రిలీజ్ చేయాలని చాలా కాలం ఎదురు చూసినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు ఇంకా దిగజారడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వివరించాడు. గత ఏడాది ఎగ్జిబిటర్ల సమాఖ్య సల్మాన్ ని కలిసి ఎట్టి పరిస్థితిలో రాధేని ఓటిటికి ఇవ్వొద్దని ప్రత్యేకంగా విన్నవించారు. అయినా కూడా సల్మాన్ మాట తప్పేలా చేసింది కరోనా.

ఈ సినిమాను ప్రదర్శించుకోవడం వల్ల వచ్చే ఇండియా థియేట్రికల్ రెవిన్యూ జీరో అయిపోయిందని ఒప్పేసుకున్న సల్మాన్ ఇంత కన్నా వేరే మార్గం లేదని చెప్పాడు. పనిలో పనిగా అభిమానులకు ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. చాలా చోట్ల ఫ్యాన్స్ బృందాలుగా ఏర్పడి ఆడిటోరియంలను బుక్ చేసుకుని రాధేను ప్రైవేట్ స్క్రీనింగ్ లో చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే సల్మాన్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కరోనా ప్రబలుతున్న తరుణంలో ఇలా గుంపులుగా సినిమా చూస్తే తాను బాధ్యత వహించాల్సి వస్తుందని హితవు పలికాడు. అయినా కూడా వాళ్ళు వినేలా కనిపించడం లేదు. అది వేరే సంగతి.

రేపటి ప్రీమియర్ మీద భారీ నిర్మాణ సంస్థలు కూడా కన్నేశాయి. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, జీ సంస్థకు వచ్చే ఆదాయం ఏ మోడల్ లో ఉండబోతోందనే కోణంలో చాలా విశ్లేషణలు చేయబోతున్నారు. ఎందుకంటే సూర్యవంశీ లాంటి ఇతర భారీ ప్రాజెక్టులు ఇప్పటికే ఏడాదిన్నర పైగా వెయిటింగ్ లో ఉన్నాయి. పెట్టుబడుల భారం పెరుగుతోంది. రాధే ప్లాన్ కనక వర్కౌట్ అయితే అధిక శాతం దాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన రాధేలో దిశా పటాని హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన డీజే ట్యూన్ సీటిమార్ ఇప్పటికే చార్ట్ బస్టర్ అయ్యింది. రేపు మధ్యాన్నం 12 నుంచి రాధే ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయని టాక్.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp