ట్రైలర్ మీద నెటిజెన్ల ప్రతీకారం

By iDream Post Aug. 12, 2020, 12:08 pm IST
ట్రైలర్ మీద నెటిజెన్ల ప్రతీకారం

ముప్పై ఏళ్ళ క్రితం 1990లో సంజయ్ దత్ హీరోగా మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన సడక్ ఒక సంచలనం. కమర్షియల్ సినిమాకు భిన్నంగా ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తూ తీర్చిదిద్దిన ఈ యాక్షన్ డ్రామా అప్పట్లో రికార్డులు సృష్టించింది. సంజయ్ దత్ కు పెద్ద బ్రేక్ గా నిలిచిన ఈ సినిమా తర్వాతే ఆయన ఇంకా బిజీ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత దానికి సీక్వెల్ రాబోతోంది. సడక్ 2 పేరుతో మహేష్ భట్టే రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ఇందాకా విడుదల చేశారు. డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఈ నెల 28న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసుకోబోతున్న సడక్ 2లో ఆదిత్య రాయ్ కపూర్, అలియా భట్ లు లీడ్ పెయిర్ గా నటించగా సంజయ్ దత్ ఆ క్లాసిక్ లోని డ్రైవర్ పాత్రనే తిరిగి పోషించారు.

ఓ నిజం అన్వేషించానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరిన ఓ అమ్మాయి(అలియా భట్)తనకు సాయంగా రమ్మని ఓ డ్రైవర్(సంజయ్ దత్)ని కోరుతుంది. ముందు వద్దన్నా అతను సరే అంటాడు. ఇద్దరు కలిసి మధ్యలో జైలు నుంచి విడుదలైన ఆమె ప్రియుడు(ఆదిత్య రాయ్ కపూర్)తో కలిసి ప్రయాణం కొనసాగిస్తారు. ఊహించని విధంగా ఓ పెద్ద నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడతారు. ప్రమాదాల్లో దిగిన ఆ జంటకు అండగా నిలబడతాడు డ్రైవర్. ముందు ఆ తర్వాత ఏం జరిగిందన్నదే సడక్ 2 కథ. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. మంచి ఎమోషనల్ రోడ్ జర్నీతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. దొంగ బాబాల ముసుగులో విలన్ చేసే అరాచకాలను మెయిన్ ప్లాట్ గా తీసుకున్నారు.

ఈ ముగ్గురితో పాటు సడక్ ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నటించిన పూజా భట్ తో పాటు జిస్సు సేన్ గుప్తా, మకరంద్ దేశ్ పాండే, గుల్షన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీడియో సంగతి పక్కనపెడితే సడక్ 2 ట్రైలర్ కు భారీ డిస్ లైకులు వచ్చి పడుతున్నాయి. కేవలం గంట వ్యవధిలోనే లక్షకు పైగా డిజ్లైకులు రాగా కేవలం వేలల్లో లైకులు ఉన్నాయి. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెటిజం మీద ప్రేక్షకులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాళ్ళ లిస్టులో అలియా భట్ కూడా ఉంది. దాన్ని ఈ రూపంలో తీర్చుకుంటున్నారన్న మాట. మొత్తానికి సడక్ 2 ఇంట్లోనే కూర్చుని చూసే సినిమాగా ట్రైలర్ ద్వారా ఆసక్తినైతే రేపింది. అంచనాలకు తగ్గట్టు ఉంటే దిల్ బేచారా తర్వాత హాట్ స్టార్ కు మరో సూపర్ హిట్ దక్కుతుంది. ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజవుతున్న మొదటి సంజయ్ దత్ సినిమా కూడా ఇదే కావడంతో అభిమానుల్లోనూ ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp