ఆ సినిమాకు నెపోమీటర్ స్కోర్ 98%

By Satya Cine Jul. 03, 2020, 09:00 pm IST
ఆ సినిమాకు నెపోమీటర్ స్కోర్ 98%

గత కొంతకాలంగా నెపోటిజం పై చర్చ జోరుగా సాగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఈ విషయంపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినవారికి అన్నీ అవకాశాలు ఇస్తూ బయటివారికి మొండిచేయి చూపిస్తున్నారని, దీంతో కొందరు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సరైన అవకాశాలు లేకపోవడం, వృత్తి పరమైన ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. దీనికి కారణం కొందరు ప్రముఖ దర్శక నిర్మాతలు, సీనియర్ హీరోలు అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

తాజాగా సుశాంత్ కుటుంబ సభ్యులు ఒక సినిమాలో నెపోటిజం ప్రభావం ఎంత ఉందో తెలుసుకునేలా 'నెపోమీటర్' ను ప్రారంభించారు. ఈ సోషల్ మీడియా పేజిలో ప్రతి సినిమాకు నెపోటిజం శాతం ఎంతో ఐదు రకాల అంశాల ఆధారంగా తేలుస్తారు. దర్శకుడు ఎవరు, నిర్మాత ఎవరు, ప్రధాన పాత్రలలో ఎవరు నటిస్తున్నారు, సహాయక పాత్రలలో ఎవరున్నారు, రచయిత ఎవరు? ఈ అంశాల ఆధారంగా నెపోమీటర్ శాతం నిర్ణయిస్తారు. దీని ద్వారా ఒక సినిమాలో తమ కుటుంబ సభ్యులకు ఇతర స్టార్ హీరోల బంధువులకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు? బయటి వారికి ఎన్ని అవకాశాలు ఇచ్చారు అనే విషయం ప్రజలకు వెంటనే తెలుస్తుంది.

అంటే ఒక సినిమాకు ఎక్కువ స్కోర్ వస్తే నెపోటిజం ఎక్కువ అని, తక్కువ స్కోర్ వస్తే బయటి వారికి అవకాశాలు ఇచ్చారని తెలుస్తుంది. ఈ నెపోమీటర్లో బాలీవుడ్ చిత్రం 'సడక్ 2' కు అత్యధికంగా 98% స్కోర్ వచ్చింది. నిర్మాత, రచయిత, దర్శకుడు, హీరోయిన్ అందరూ బంధువులే. ఇక ఇతర కీలక పాత్రలు చేసిన నటీనటులందరూ ప్రముఖ సినీ కుటుంబాలకు చెందినవారే. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ చెయ్యాలంటూ కొందరు నెపోటిజం వ్యతిరేకులు ఇప్పటి నుంచే నినాదాలు ఇవ్వడం మొదలు పెట్టారు!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp