బుల్లితెరపై సాహో సంచలనాలు

By Ravindra Siraj Feb. 16, 2020, 12:03 pm IST
బుల్లితెరపై సాహో సంచలనాలు

డార్లింగ్ ప్రభాస్ ఒకప్పుడేమో కానీ బాహుబలి తర్వాత నేషనల్ లెవెల్ లో స్టార్ అయిపోయాడు. దేశం నలుమూలలా గుర్తింపు వచ్చేసింది. చిరంజీవి, నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోల వల్ల సాధ్యం కాని స్టార్ ఇమేజ్ ని ప్రభాస్ ఒక్క సినిమాతోనే సంపాదించుకున్నాడు. ఈ కారణంగానే సాహో సౌత్ లో డిజాస్టర్ గా నిలిచినా నార్త్ లో దీనికి మంచి లాభాలు వచ్చాయి. అక్కడి ప్రేక్షకులు బాగానే చూసి హిట్ అనిపించారు. అయితే దీనికి ఇంకో ఘనత వచ్చి చేరింది.

ఇటీవలే జీ ఛానల్ లో సాహో హిందీ వెర్షన్ ప్రీమియర్ ప్రసారం చేశారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది కాబట్టి వ్యూస్ భారీగా వస్తాయో రావో అనే అనుమానం నెలకొంది. దాన్ని బద్దలు చేస్తూ సాహో మతిపోయే రేటింగ్ తో ఏకంగా టాప్ 5 ప్లేస్ దక్కించుకుంది. సుమారు 128 కోట్ల దాకా వ్యూస్ వచ్చినట్టు సమాచారం. దీని కన్నా ముందు హౌస్ ఫుల్ 4, టోటల్ ఢమాల్, 2.0, కేసరి మాత్రమే ఉన్నాయి. మొదటిసారి టెలికాస్ట్ లో అత్యధిక రేటింగ్ సంపాదించుకున్న సినిమాలు ఇవే.

ఈ లెక్కన సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రభాస్ ని థియేటర్లోనే కాక చిన్ని తెరపై చూసేందుకు కూడా ఉత్తరాది ప్రేక్షకులు ఎగబడతారని మరోసారి రుజువయ్యింది. సుజిత్ దర్శకత్వం వహించిన సాహోలో శ్రద్ధా కపూర్, జాకీ శ్రోఫ్, చుంకీపాండే, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ తారాగణం ఉండటం బాగా ప్లస్ అయ్యింది. ఈ లెక్కన ప్రభాస్ కొత్త సినిమాకు ఇంతకన్నా ఎక్కువ డిమాండ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. గత చిత్రాల తరహాలోనే దీనికీ రెండు వందల కోట్ల బడ్జెట్ తో అంతకు మించిన బిజినెస్ తో సంచలనాలు నమోదు కావడం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp