సాహు దర్శకుడికి పెళ్లి ఘడియలు

By iDream Post Jun. 03, 2020, 12:00 pm IST
సాహు దర్శకుడికి పెళ్లి ఘడియలు

లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమ మొత్తం సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయింది కానీ కొత్త పెళ్లి కొడుకుల లిస్టు మాత్రం పెరుగుతూ పోతోంది . నిఖిల్, దిల్ రాజు, రంగస్థలం మహేష్ ఇప్పటికే హడావిడి లేకుండా వివాహాలు చేసుకోగా రానాను ఆగస్ట్ లో ఇంటివాడిని చేసేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ రెడీ అవుతోంది. ఇక నితిన్ కు సంబంధించిన డేట్, వెన్యు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తాజాగా వీళ్ళ బ్యాచ్ లోకి సాహో ఫేం దర్శకుడు సుజిత్ కూడా చేరబోతున్నట్టు తెలిసింది. దంత వైద్యురాలైన ప్రవల్లికను ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నాడట. ఇప్పటిదాకా ఇది సన్నిహితులకు తప్ప ఎవరికి తెలియకుండా ఉండటం గమనార్హం.

టిక్ టాక్ లోనూ ఫేమస్ సింగర్ అయిన ప్రవల్లికతో సుజిత్ కు చాలా కాలం నుంచే లవ్ స్టొరీ ఉందట. ఇప్పుడు ఇరు పెద్దల అంగీకారంతో తమ బంధాన్ని మ్యారేజ్ రూపంలో ప్రకటించబోతున్నారు. ఈ నెల 10న సింపుల్ గా హడావిడి లేకుండా ఇంకా నిబంధనలు అమలులో ఉన్నాయి కాబట్టి పరిమిత సంఖ్యలో ఆహ్వానితుల మధ్య ఈ తంతును జరిపించనున్నారు. సుజిత్ తనకు తానుగా ఈ విషయం చెప్పలేదు కాని లీకైన న్యూస్ ఇప్పటికే మీడియా వర్గాల్లో జోరుగా షికారు చేస్తోంది. శర్వానంద్ రన్ రాజా రన్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాక ప్రభాస్ సాహో కోసం చాలా గ్యాప్ తీసుకుని పాన్ ఇండియా లెవల్ లో దాన్ని తెరకెక్కించిన సుజిత్ దురదృష్టవశాత్తు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు.

అయినా టేకింగ్ పరంగా విషయమున్నవాడే అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుకే మెగాస్టార్ చిరంజీవి ఏరికోరి మరీ ఆచార్య తర్వాత చేయబోయే లూసిఫర్ రీమేక్ బాద్యతను సుజిత్ చేతిలో పెట్టారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. చిరంజీవి కొన్ని రికమండేషన్స్ చెప్పారట. అన్నీ ఓకే అయ్యాక ఫైనల్ వెర్షన్ లాక్ చేస్తారు. ఆచార్య షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దాన్ని బట్టి దీని ప్లానింగ్ ఆధారపడి ఉంది. మెగా ఆఫర్ కాబట్టి దీన్ని కనక సద్వినియోగపరుచుకుంటే సాహో తాలుకు గాయాల నుంచి త్వరగా బయటపడవచ్చు. కరోనా వల్ల ప్రపంచానికి జరిగిన చెడే ఎక్కువ కానీ సుజిత్ కు మాత్రం రెండు రకాలుగా కలిసి వచ్చింది. ఒకటి మెగాస్టార్ తో చేసే ఛాన్స్ రెండోది జీవితంలో చాలా ముఖ్యమైన పెళ్లి ఘట్టం. అదృష్టమంటే ఇదేనేమో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp