రౌడీ అల్లుడు జంట కలవనుందా ?

By iDream Post Sep. 29, 2021, 12:30 pm IST
రౌడీ అల్లుడు జంట కలవనుందా ?

ఇప్పటితరం ప్రేక్షకులకు అంతగా అవగాహన ఉండకపోవచ్చు కానీ 90 దశకంలో యూత్ కి మాత్రం హీరోయిన్ శోభన ఖచ్చితంగా గుర్తుంటారు. విజయశాంతి, రాధ లాంటి గ్లామర్ భామల డామినేషన్ ని తట్టుకుని ఎలాంటి స్కిన్ షోలు చేయకుండా మంచి సినిమాలు మాత్రమే ఏరికోరి చేసిన నటిగా అప్పట్లో తనకు పెద్ద హిట్లే పడ్డాయి. చిరంజీవి రౌడీ అల్లుడు, బాలకృష్ణ నారీ నారీ నడుమ మురారి, నాగార్జున రక్షణ, వెంకటేష్ అజేయుడు, మోహన్ బాబు రౌడీ గారి పెళ్ళాం, రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్ 1 విడుదల, నరేష్ కోకిల, రజినీకాంత్ దళపతి, కృష్ణ అల్లుడు దిద్దిన కాపురం లాంటి అగ్ర హీరోల అద్భుత చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి.

ఏడెనిమిదేళ్లు టాలీవుడ్ లో బాగా యాక్టివ్ గా ఉన్నాక సినిమాలు తగ్గించేసిన శోభన 1997లో మమ్ముట్టి సుమన్ ల సూర్యపుత్రులు చేశాక గ్యాప్ తీసుకున్నారు. మంచి నృత్యకారిణి అయిన ఈవిడ ఎన్నో రంగస్థల ప్రదర్శనలతో పాటు ఎందరికో శిక్షణ ఇచ్చారు. తిరిగి 2006లో మోహన్ బాబు విష్ణుల గేమ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు కానీ అదేమంత ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ అడపాదడపా ఇతర భాషల్లో నటిస్తూనే ఉన్నారు. గత ఏడాది మలయాళంలో చేసిన ఓ సినిమా బాగానే ఆడింది. దీన్నే తెలుగులో పరిణయం పేరుతో తెలుగు డబ్బింగ్ చేసి ఆహాలో ఇటీవలే స్ట్రీమింగ్ చేశారు.

ఇన్నేళ్ల తర్వాత శోభన మళ్ళీ తెరమీద కనిపించే అవకాశం ఉందట. చిరంజీవి హీరోగా రూపొందుతున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో మంజు వ్వారియర్ చేసిన పాత్రకు తనను పరిశీలిస్తున్నారని తెలిసింది. ముందు రమ్యకృష్ణ, ప్రియమణి, అనసూయ ఇలా ఏవేవో పేర్లు వినిపించాయి కానీ ఎవరు ఫైనల్ అవుతారో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. గోవాలో చిన్న షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్ వచ్చే నెల నుంచి వేగం పెంచబోతోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి కానీ ఏదీ అఫీషియల్ గా ఇప్పటిదాకా కన్ఫర్మ్ కాలేదు. శోభన న్యూస్ కూడా వేచి చూడాల్సిందే

Also Read :  మెగాస్టార్ మాస్ మహారాజ్ కలవబోతున్నారా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp