సాహో చెప్పిన పాఠం నేర్వలేదే

By iDream Post Jul. 10, 2020, 05:21 pm IST
సాహో చెప్పిన పాఠం నేర్వలేదే

ఇవాళ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ గురించిన పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. టైటిల్ ఎప్పుడో లీకైపోయింది కాబట్టి దాని పట్ల పెద్ద ఎగ్జైట్మెంట్ అనిపించలేదు కానీ ప్రభాస్ పూజాలు ఎలా ఉంటారన్న దాని మీదే విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే పోస్టర్ పట్ల మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమయింది. బాగుందని కొందరు, బాలేదని మరికొందరు, కాపీ కొట్టారని మరికొందరు ఇలా ఎవరికి తోచిన బాష్యం వాళ్ళు చెబుతున్నారు . నిజానికి ఇవాళ వచ్చిన లుక్ వరుణ్ తేజ్ కంచె, సంజయ్ లీలా భన్సాలీ రాంలీలలను పోలి ఉంది. వాటిని పక్కపక్కనే పెడుతూ ఇప్పటికే కొన్ని లక్షల నెటిజెన్లు ఈ విషయాన్నీ వైరల్ చేసేశారు.

ఇంతోటి దానికా నెలల తరబడి వెయిట్ చేయించారని కామెంట్స్ చేసినవాళ్ళు లేకపోలేదు. దేనికైనా పాజిటివ్ నెగటివ్ ఫీడ్ బ్యాక్ కామనే కాబట్టి ఇదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నా సాహోకు జరిగిన మిస్టేక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యిందని మాత్రం చెప్పక తప్పదు. ఇవాళ వదిలిన పోస్టర్లో ముఖ్యమైన టెక్నికల్ టీం సభ్యుల పేర్లు ఉన్నాయి కాని అసలైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పనే లేదు. అమిత్ త్రివేదితో మొదలుపెట్టి జస్టిన్ ప్రభాకర్ దాకా వచ్చి తాజాగా జూలియస్ పకియం దగ్గర ప్రచారం ఆగిపోయింది. పోనీ ఈ విషయంలో అయినా కొంచెం క్లారిటీ ఇచ్చి ఉంటె బాగుండేది. సాహోకు కూడా ఇదే తరహాలో చాలా చాలా ఆలస్యంగా సంగీత దర్శకుడిని ఫిక్స్ చేశారు.

అక్కడికీ నేపధ్య సంగీతానికి జిబ్రాన్ ని పాటల కోసం బాలీవుడ్ కంపోజర్స్ ని అరువు తెచ్చారు. దానికి తగ్గట్టే ఫలితం కూడా సోసోగానే వచ్చింది. ఇప్పుడు రాధే శ్యాంకు సైతం ఇదే రిపీట్ అవుతోంది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అభిప్రాయాన్ని గౌరవించి ఎంపిక చేయాలనీ అందుకే ఎటూ తేల్చుకోలేక ఇలా వదిలేస్తున్నారన్న టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా సగం షూటింగ్ అయ్యాక కూడా ఇలా కంపోజర్ విషయంలో క్లారిటీ లేకపోవడం మాత్రం విచిత్రం. ఇక టీజర్ వచ్చే దాకా వేచి చూడక తప్పేలా లేదు. అప్పటిదాకా ఏవేవో పేర్లు వాడుకలోకి వస్తూ ఉంటాయి తప్ప దీనికి సంబంధించి అఫీషియల్ క్లారిటీ మాత్రం అంత సులభంగా రాదు. యువి సంస్థ మీద ఉన్న అభిప్రాయం మారకుండా మొత్తానికి సాహో పొరపాటే మళ్ళీ రిపేట్ చేయడం విచారకరం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp