రిలీజులు సరే - మరి ప్రమోషన్లు ?

By iDream Post Sep. 24, 2020, 05:01 pm IST
రిలీజులు సరే - మరి ప్రమోషన్లు ?

ఇంకో ఆరు రోజుల్లో రెండు టాలీవుడ్ కొత్త సినిమాలు నేరుగా ఓటిటి లో రాబోతున్నాయి. ఒకటి అనుష్క నిశ్శబ్దం కాగా రెండోది రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా. అక్టోబర్ 2 కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం ఎందుకో అంత యాక్టివ్ నెస్ కనిపించడం లేదు. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా జూమ్ మీటింగులు, స్పెషల్ గా కట్ చేసిన వీడియో క్లిప్పులు, పాత్రల పరిచయాలు ఇవేవి అంతగా లేవు. థియేట్రికల్ రిలీజ్ అయితే ఫంక్షన్లు ఈవెంట్లు ప్రెస్ మీట్లు అబ్బో ఆ హడావిడే ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఓటిటి విడుదలలో అలాంటి ఆ హంగామా సాధ్యం కాదు.

వి సంగతి చూస్తే రెండు వారాల ముందే నాని, సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహనకృష్ణ ఫుల్ స్వింగ్ లో తమ సినిమాకు పబ్లిసిటీ చేసుకున్నారు. అది హైప్ రావడానికి బాగా ఉపయోగపడింది. మాధ్యమం ఏదైనా ప్రేక్షకుల దాకా మన ప్రోడక్ట్ చేరాలంటే మార్కెటింగ్ అవసరం. ఇంట్లోనే చూస్తారు కదా మళ్ళీ ఎందుకు ప్రచారం అనుకోవడానికి లేదు. అసలే ఐపిఎల్ కాలం. సాయంత్రం అయితే చాలు యువత, క్రికెట్ లవర్స్ అందరూ టీవీలకు, స్మార్ట్ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. అలాంటప్పుడు ఆన్ లైన్ టాక్, రివ్యూస్ ని తట్టుకుని ఓటిటిలో అయినా సినిమా నిలవాలంటే పదే పదే దాన్ని గుర్తు చేయడం చాలా అవసరం. ఒరేయ్ బుజ్జిగా కోసం ఆహా యాప్ ఏదో కొంత ప్రమోషన్ అయితే చేసుకుంటోంది కానీ మరీ ఎక్కువ సౌండ్ అయితే రావడం లేదు.

విచిత్రంగా టీవీ ఛానల్స్ అయితే కొత్త సినిమాలకు సంబంధించి స్పెషల్ ఛాట్ షోలు, లైవ్ ఇన్ ప్రోగ్రాములు లాంటివేవీ నిర్వహించడం లేదు. కరోనా సాకుగా చెప్పడానికి లేదు. అవసరం లేని ఎన్నో టాపిక్స్ గురించి నిత్యం వాటిలో డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు క్రేజ్ ఉన్న సినిమాల గురించి కార్యక్రమాలు చేయడం కూడా అవసరం. నిశ్శబ్దం గురించి ప్రైమ్ తన ఒరిజినల్ ప్రొడక్షన్ గా ప్రమోట్ చేసుకుంటోంది కానీ అనుష్కతో పాటు మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజులు కూడా వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే జనాల అటెన్షన్ ఇటు వైపు వస్తుంది. వరస ఫ్లాపులతో డీలాపడిన రాజ్ తరుణ్ ఆశలు కూడా అన్నీ ఒరేయ్ బుజ్జిగా మీదే ఉన్నాయి. ఇప్పుడున్న అతి తక్కువ టైంలో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఈ రెండు సినిమాలకూ ఉంది. అదే రోజు ఇతర బాషల నుంచి గట్టి పోటీనే నెలకొంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp