శ్యామ్ సింగ రాయ్ మార్పు వెనుక కారణం

By iDream Post Oct. 20, 2020, 09:24 pm IST
శ్యామ్ సింగ రాయ్ మార్పు వెనుక కారణం

వి సినిమా రిజల్ట్ ఎంత డిజాస్టర్ అయినప్పటికీ నాని వరకు డిఫరెంట్ నెగటివ్ రోల్ చేసిన సంతృప్తి మిగిలింది. థియేటర్లలో విడుదలై ఉంటే ఏం జరిగేదో కానీ మొత్తానికి డిజిటల్ లో వచ్చి చాలా సేఫ్ అయ్యింది. ప్రస్తుతం టక్ జగదీశ్ షూటింగ్ పనుల్లో ఉన్న నాని ఆ యూనిట్ లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో మళ్ళీ హోమ్ క్వారెంటైన్ కే పరిమితం కావాల్సి ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం కీలక దశలో ఉంది. దీని తర్వాత శ్యామ్ సింగ రాయ్ లైన్ లో ఉంది. విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా తీసి ఇండస్ట్రీ దృష్టిలో పడ్డ రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ మూవీ అధిక శాతం కోల్కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే డిసెంబర్ లోనే రిలీజయ్యేది. ముందు దీన్ని ఫైనల్ చేసిన నిర్మాత సితార బ్యానర్ సూర్యదేవర నాగవంశీ.

కానీ ఇప్పుడిది చేతులు మారబోతున్నట్టుగా తెలిసింది. వెంకట్ బోయినపల్లి అనే మరో ప్రొడ్యూసర్ దీన్ని టేకప్ చేసే విధంగా తెరెవెనుక ఒప్పందం పూర్తయ్యిందట. దీని కారణం బడ్జెట్ అని వినికిడి. శ్యామ్ సింగ రాయ్ కి ఎంతలేదన్నా పాతిక నుంచి ముప్పై కోట్ల దాకా ఖర్చు అవసరమవుతోందట. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా కొన్ని మార్పులు చేసి తగ్గిద్దాం అన్న వంశీ ప్రతిపాదనకు నాని అంత సుముఖత చూపకపోవడంతో ఇలా చేతులు మారాల్సి వచ్చిందని ఫిలిం నగర్ టాక్. కొంత ఆలస్యమైనా కోల్కతాలో తీస్తేనే కథకు న్యాయం జరుగుతుందని, హైదరాబాద్ కు మారిస్తే సోల్ దెబ్బ తినొచ్చని అలా నిర్ణయం మార్చుకున్నారట.

ఇప్పుడిది ఇంకా అఫీషియల్ గా బయటికి రావాల్సి ఉంది. వి ఫలితం సంగతి ఎలా ఉన్నా నాని ఇకపై రిస్కులు చేసేందుకు ఇష్టపడటం లేదు. స్క్రిప్ట్ అండ్ బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా అన్ని సమకూరేలా కాంబినేషన్లు సెట్ చేసుకుంటున్నాడట. సితారకు భవిష్యత్తులో వేరే కమిట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందబోయే శ్యామ్ సింగ రాయ్ లో ఇంకా హీరోయిన్లని ఫైనల్ చేయలేదు. సాయి పల్లవితో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టక్ జగదీశ్ పూర్తయ్యేలోగా సెట్ చేసేస్తారు. ప్రతి ఏడాది కనీసం రెండు లేదా మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకునే నానికి వైరస్ పుణ్యమాని 2020లో అసలు థియేట్రికల్ రిలీజే లేకుండా పోయింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp