రాధే రంగ్ దే - దారి చూపిస్తున్న రెండు సినిమాలు

By iDream Post Oct. 03, 2020, 07:47 pm IST
రాధే రంగ్ దే - దారి చూపిస్తున్న రెండు సినిమాలు

ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మంది ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు. కరోనా పూర్తి స్థాయిలో తగ్గకపోవడం, వ్యాక్సిన్ కు ఇంకా టైం పట్టేలా ఉండటం దీనికి కారణాలు. ఈ ఒక్క అక్టోబర్ ని మినహాయించి నవంబర్ నుంచి స్టార్ట్ చేసుకుందామని దర్శక నిర్మాతలకు మెసేజులు పంపిస్తున్నారు. హైదరాబాద్ లోనే ఇంతగా భయపడుతుంటే ఇంక విదేశాలకు వెళ్లడం గురించి చెప్పేదేముంది. కానీ ప్రభాస్ రాధే శ్యామ్, నితిన్ రంగ్ దే యూనిట్లు ఇటలీకి పయనమవుతూ అందరికీ స్ఫూర్తి గా నిలుస్తున్నాయి. డార్లింగ్ ఇప్పటికే తన టీమ్ తో అక్కడికి చేరుకోగా రంగ్ దే బృందం మూడు వారాల షెడ్యూల్ వేసుకుని ప్రస్తుతం వీసా ప్రాసెస్ లో ఉంది.

వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలంటే చేతిలో ఉన్న మూడు నెలల సమయంలో కాళ్లకు చక్రాలు కట్టుకుని పరిగెత్తాలి. కథ డిమాండ్ మేరకు బాలన్స్ భాగాన్ని ఇక్కడే షూట్ చేసే అవకాశం లేకపోవడంతో ఇటలీ వెళ్ళడానికే డిసైడ్ అయ్యారు. ఏ చిన్న మార్పు చేసినా మొత్తం చెడిపోతుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న రంగ్ దేలో కీర్తి సురేష్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. ఓటిటి ఆఫర్లు ఎంత ఊరిస్తున్న ప్రస్తుతానికి కంట్రోల్ అనుకుంటూ వాటిని పక్కనపెట్టేశారు. ఇక రాధే శ్యామ్ కు సంబంధించి ఇప్పటిదాకా కేవలం మోషన్ పోస్టర్ మాత్రమే వచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెలలోనే టీజర్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటలీలో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేసుకుని రాగానే ఇక్కడ పూర్తి చేయాల్సిన కొంచెం వర్క్ మాత్రమే బాలన్స్ ఉంటుంది.

ఆ తర్వాత సమ్మర్ రిలీజ్ కు ఏర్పాట్లు చేసుకోవచ్చు. లేదూ అంతకన్నా ముందే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు రంగ్ దే, రాధే శ్యామ్ లు ఇటలీ వెళ్లడం అందరినీ ఆలోచనలో పడేస్తోంది . మనమే మరీ అతి జాగ్రత్త పడుతున్నామా అని అనుకుంటున్న హీరోలు లేకపోలేదట. కొందరు దేశాలే దాటినప్పుడు మనం కనీసం రాష్ట్రాల సరిహద్దులు క్రాస్ చేయకపోతే ఎలా అని ఆలోచిస్తున్నారు. అక్షయ్ కుమార్ తన బెల్ బాటమ్ ని అతి తక్కువ రోజుల్లో విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని రావడం ఇప్పటికే సంచలనంగా మారింది. నిజం చెప్పాలంటే ఇక్కడ కంటే ఫారిన్ లో షూట్ చేసుకోవడమే తక్కువ రిస్క్ గా కనిపిస్తోంది. అనుమతులు కూడా సులభంగానే వస్తున్నాయి. వీసాలకు పెద్దగా అడ్డంకులు కూడా లేవు. సర్కారు వారి పాట కోసం పరశురామ్ ఆల్రెడీ యుఎస్ లో మకాం వేసి లొకేషన్ వేటలో బిజీగా ఉన్నాడు. మరి రంగ్ దే, రాధే శ్యామ్ లను చూసి ఇంకెందరు ముందుకువ వస్తారో చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp