Pushpa Trailer : ఎర్రచందనం దోపిడీలో దొంగల దందా

By iDream Post Dec. 06, 2021, 09:56 pm IST
Pushpa Trailer : ఎర్రచందనం దోపిడీలో దొంగల దందా

అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత సుమారు రెండేళ్ల గ్యాప్ తో వస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ లో మొదటి సారి పాన్ ఇండియా రిలీజ్ కు వెళ్తున్న బన్నీ ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం. తమిళ ప్రేక్షకులను ఈ నెల 17న పలకరించబోతున్నారు. రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్ళకు పైగా పుష్ప పనిమీదే ఉన్న దర్శకుడు సుకుమార్ దీని మీద ముందు నుంచి చాలా కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తూ వచ్చారు. రష్మిక మందన్న గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. కాస్త ఆలస్యంగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది

శేషాచలం అడవుల్లో బంగారం కంటే విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పుష్పరాజ్(అల్లుఅర్జున్). ఫారెస్ట్ పోలీసులు పట్టుకుని చిత్రహింసలు పెట్టినా కూడా తన యజమాని పేరు చెప్పడు. ఇతనికో ప్రియురాలు కూడా ఉంటుంది. పేరు శ్రీవల్లి(రష్మీక మందన్న). చేజులు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు పెట్రేగిపోతాయి. పుష్ప ఎవరికీ దొరకని కొరకరాని కొయ్యగా మారుతాడు. ఇతనికి దుంగల దందాలు చేసే స్థానిక నాయకులకు కనెక్షన్ ఏంటి అనేది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే. చిక్కనైన అటవీ నేపథ్యంలో సినిమా చాలా సీరియస్ గా నడిపించినట్టు కనిపిస్తోంది. ప్రతీ పాత్రలో హై ఇంటెన్సిటీ జొప్పించారు

అల్లు అర్జున్ అడవి స్మగ్లర్ గా చాలా డిఫరెంట్ లుక్స్ తో అంచనాలకు మించి ఉన్నాడు. డైలాగ్ డెలివరీ కూడా చిత్తూరు యాసలో అదరగొట్టేశాడు. సుకుమార్ ట్రైలర్ లోనే దాదాపు పాత్రలన్నీ చూపించేశారు. విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో టాలీవుడ్ సినిమా వచ్చి ఏళ్ళు దాటుతోంది. అందుకే ఫ్రెష్ అప్పీల్ కనిపిస్తోంది. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయలను ముందెన్నడూ చూడని అవతారాల్లో ప్రెజెంట్ చేయడం బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ బిజిఎంతో చంపేశాడని చెప్పొచ్చు. మిరోస్లా బ్రోజెక్ ఛాయాగ్రహణం హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోలేదు. మొత్తానికి ఇంకో పది రోజుల్లో రాబోతున్న పుష్ప హైప్ అమాంతం రెట్టింపు చేసేలా ఇచ్చిన ఈ ట్రైలర్ కట్ అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకూ ఆసక్తిని పెంచేసింది

Also Read : PAN India Movies : పాన్ ఇండియా సినిమాలకు టెన్షన్ తప్పదా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp