'రాధే శ్యామ్' వచ్చేశారు : అఫీషియల్

By iDream Post Jul. 10, 2020, 10:21 am IST
'రాధే శ్యామ్' వచ్చేశారు : అఫీషియల్

ప్రభాస్ అభిమానులతో పాటు సినిమా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ 20 టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ ఇందాక విడుదల చేశారు. నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి పెద్దగా అప్ డేట్స్ ఇవ్వకుండా ఊరిస్తూ వచ్చిన టీమ్ ఎట్టకేలకు ఫ్యాన్స్ కు ఊరట కలిగించింది. ఎర్రటి రంగులో ఉన్న సముద్రం బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్, పూజాలు కౌగిలించుకున్న ఫోటో చాలా క్రియేటివ్ గా ఉంది. థీమ్ ని చూచాయగా చెప్పకనే చెప్పారు. ఇది ఎన్నో నెలల నుంచి ప్రచారంలో ఉన్న పేరే అయినప్పటికీ ప్రకటించే దాకా ఖచ్చితంగా చెప్పుకోలేం కాబట్టి ఇప్పటిదాకా అనధికారికంగానే చెలామణి అవుతూ వచ్చింది. ఏదైతేనేం ఫైనల్ గా 'రాధే శ్యామ్'కే కట్టుబడ్డారు. అయితే యధావిధిగా సంగీత దర్శకుడిని మాత్రం రివీల్ చేయలేదు.

నిజానికి దీనికి ముందు జాన్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉండేది. 96 రీమేక్ కోసం దిల్ రాజు జానుకు మొగ్గు చూపడంతో యువి సంస్థను సంప్రదించి దీన్ని లాక్ చేసుకున్నారు. కాబట్టి జాన్ ఉండదని ముందే అర్థమైపోయింది. తర్వాతే ఈ రాధే శ్యామ్ టైటిల్ చెలామణిలోకి వచ్చింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ మూవీని యూరోప్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ లవ్ స్టోరీగా రూపొందించినట్టు ఇప్పటికే టాక్ ఉంది. పీరియాడిక్ తరహాలో ఉంటూనే వర్తమానాన్ని టచ్ చేస్తూ ఎవరూ ఊహించని మలుపులతో కథనం ఉంటుందని ఇన్ సైడ్ న్యూస్. గోపిచంద్ తో జిల్ చేసిన రాధాకృష్ణ ఈ సినిమా కోసమే ఐదేళ్లు వేచి చూశాడు. బాహుబలి, సాహో వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.

ఇందులో కీలక తారాగణం ఎవరెవరున్నారు అనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. క్యాస్టింగ్ భారీగా ఉంటుందని చెప్పడమే తప్ప దాని తాలూకు డీటెయిల్స్ లీక్ కాకుండా టీమ్ జాగ్రత్త పడుతూ వచ్చింది. లాక్ డౌన్ రాకపోయి ఉంటే జార్జియాతో పాటు ఇతర దేశాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ఈపాటికి ఓ కొలిక్కి వచ్చి ఉండేది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడీ బాలన్స్ షూటింగ్ ని ఎక్కడ ఎలా పూర్తి చేయాలో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ ఏడాది ఎలాగూ రిలీజ్ ఛాన్స్ లేదు వచ్చే సంక్రాంతికైనా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

అయితే దానికీ అవకాశం లేనట్టే. నవంబర్ లోగా షూటింగులు మొదలైతే 2021 వేసవికి రాధే శ్యామ్ ని ఆశించవచ్చు. అంతకన్నా ఆలస్యమైతే మాత్రం ఏ దసరాకో దీపావళినో అనుకోవాలి. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. యువితో పాటు కృష్ణంరాజు గారి స్వంత సంస్థ గోపికృష్ణ బ్యానర్ నిర్మిస్తున్న రాధే శ్యామ్ ని సుమారు 200 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టు ఇప్పటికే టాక్ ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడలో రూపొందుతున్న రాధే శ్యామ్ మీద ఈ పోస్టర్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp