షాక్ ఇచ్చిన ప్రీమియర్ షోలు

By iDream Post Sep. 24, 2020, 11:24 pm IST
షాక్ ఇచ్చిన ప్రీమియర్ షోలు

కొత్త సినిమాను థియేటర్లో చూసినా చూడకపోయినా టీవీలో మొదటిసారి వచ్చినప్పుడు చూస్తే వచ్చే కిక్కే వేరు. అందుకే అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటివి కొత్త రికార్డులు సృష్టించాయి. అలాంటిది నేరుగా బుల్లితెరపై ఏదైనా మూవీ వరల్డ్ ప్రీమియర్ గా వస్తే అది ఇంకెన్ని అద్భుతాలు సృష్టించాలి. అందుకే కొద్దిరోజుల క్రితం ఈటీవీలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేసినప్పుడు సదరు ఛానల్ దీని మీద చాలా అంచనాలే పెట్టుకుంది. అయితే కేవలం 5.1 టిఆర్పి రేటింగ్ రావడం షాక్ కలిగించే అంశం. ఈ సినిమా థియేటర్లో రాలేదు. చాలా ఖరీదైన ఓటిటిగా జనం భావించే నెట్ ఫ్లిక్స్ లో మాత్రమే వచ్చింది.

అయినా కూడా ఇంత తక్కువ రెస్పాన్స్ రావడం విచిత్రమే. సత్యదేవ్ హీరోగా మలయాళం రీమేక్ గా రూపొందిన ఈ మూవీకి వెంకటేష్ మహా దర్శకుడు. అధిక శాతం సామాన్య ప్రేక్షకులు ఆన్ లైన్ లో చూసి ఉండకపోచ్చనే నమ్మకానికి వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. చాలా చోట్ల పైరసీ వెర్షన్ ని స్థానిక సిటీ ఛానల్స్ లో టెలికాస్ట్ చేసేయడం కూడా ప్రభావం చూపించింది. అందులోనూ సత్యదేవ్ ఇమేజ్ పరంగా బేస్ తక్కువగా ఉన్నవాడు కావడం కూడా కొంత కారణం. ఇక విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా మొదటిసారి జెమినీలో ప్రీమియర్ అయ్యింది. ఇది కూడా ఆశ్చర్యకర రీతిలో కేవలం 5.8 రేటింగ్ తో సర్దుకోవడం వింతే. హీరో క్రేజ్,యూత్ లో ఫాలోయింగ్ దృష్ట్యా కనీసం 8 నుంచి 10 మధ్యలో రావొచ్చని అభిమానులు ఆశించారు.

కానీ ఇది చాలా తక్కువే. ఎప్పుడో ఫిబ్రవరిలో వచ్చిన సినిమా అందులోనూ డిజాస్టర్ రివ్యూలు, టాక్స్ రావడంవల్ల ఫ్యామిలీ ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించినట్టు లేరు. దీని తర్వాత విజయ్ దేవరకొండ ఇంకో సినిమా థియేటర్లో రాలేదు. అందుకే ఎక్కువ స్పందన ఉంటుందనుకుంటే ఇలా జరిగింది. దీని ద్వారా తేలిందేందంటే స్టార్లు లేని మీడియం మరియు చిన్న బడ్జెట్ సినిమాల టీవీ ప్రీమియర్లను మరీ ఎక్కువ ఆలస్యం చేసుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇండస్ట్రీ హిట్లు ఎప్పుడు వేసినా ఒకటే కానీ ఇలాంటివి మాత్రం ఎర్లీ టెలికాస్ట్ ని డిమాండ్ చేస్తాయి. అందులోనూ టెక్నాలజీ రాను రాను ఇంకా ఈజీగా చేతికందుతున్న తరుణంలో త్వరపడక తప్పదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp