పిట్ట కథలు - ఓ పిట్ట రివ్యూ

By iDream Post Feb. 21, 2021, 12:15 pm IST
పిట్ట కథలు - ఓ పిట్ట రివ్యూ

నెట్ ఫ్లిక్స్ లాంటి అంతర్జాతీయ సంస్థలు రీజనల్ కంటెంట్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాక న్యూ జనరేషన్ మూవీ మేకర్స్ పొట్టి సినిమాలను తీసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. తక్కువ నిడివి, రెండు మూడు లొకేషన్లు, పేరున్న ఆర్టిస్టులు, వేగంగా పూర్తి చేసే అవకాశం లాంటి కారణాల వల్ల పాపులర్ డైరెక్టర్స్ కూడా వీటి వైపు కన్నేస్తున్నారు. ఆ మధ్య తమిళ్ లో పావ కథైగల్ ని ఇదే తరహాలో రూపొందించిన నెట్ ఫ్లిక్స్ తాజాగా నాలుగు ఎపిసోడ్లు ఉన్న యాంథాలజీ ని పిట్ట కథలు పేరుతో విడుదల చేసింది. బాగా తెలిసున్న నటీనటులు ఉండటంతో ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇదెలా ఉందో ఈ పిట్ట రివ్యూలో చూద్దాం.

ఎపిసోడ్ 1 - రాముల

ఎక్కడో తెలంగాణలో ఉండే ఓ చిన్న పల్లెటూరిలో ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు రామ చందర్(నవీన్ బేతిగంటి)వెనుకబడిన కులానికి చెందిన రాముల(సాన్వే మేఘన)తో ప్రేమలో పడతాడు. అయితే సినిమా థియేటర్లో ఇద్దరూ రాముల అన్నయ్య కంటపడటంతో బ్రేకప్ చెప్పుకుంటారు. ఈలోగా రామచందర్ కు వేరే అమ్మాయితో పెళ్లి చూపులు ఏర్పాటవుతాయి. ఇది తెలిసి ఆత్మహత్య చేసుకోబోయిన రాములను స్థానిక రాజకీయ నాయకురాలు స్వరూప(లక్ష్మి మంచు)కాపాడుతుంది. తన స్వార్థం కోసం ఓ దారుణమైన ఎత్తుగడ వేస్తుంది. ఆ కథ ఏంటి, ఇది ఎలా విషాదంగా ముగిసిందో అందులోనే చూడాలి. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన రాములని పెర్ఫార్మన్స్ లు నిలబెట్టాయి. ముఖ్యంగా అభయ్ బేతిగంటి బాగా ఆకట్టుకుంటాడు. నలభై నిమిషాల లోపే ఉండటంతో వేగంగా పూర్తవుతుంది. జస్ట్ పర్వాలేదు అనిపిస్తుంది.

ఎపిసోడ్ 2 - మీరా

ధనవంతుడైన బిజినెస్ మెన్ విశ్వ (జగపతి బాబు)కు అతని అందమైన భార్య మీరా(అమలా పాల్)కు 18 ఏళ్ళ వ్యత్యాసం ఉంటుంది. అయినా ఇద్దరు పిల్లలతో పాటు మూడోసారి మీరా గర్భం వహించి ఉంటుంది. అందరూ తన భార్య అందాన్ని పొగుడుతూ ఉండటంతో ఆమె మీద అనుమానం పెంచుకుంటాడు విశ్వ. ప్రాణస్నేహితుడు అబ్బాస్(వంశీ చాగంటి)ని సైతం ఎఫైర్ ఉందని అనుమానిస్తాడు. ఇది కాస్త ముదిరిపోయి విశ్వా జైలుకు వెళ్లే దాకా పరిస్థితి దిగజారుతుంది. దాని వెనుక కారణాలు తెలియాలంటే మొత్తం ఎపిసోడ్ చూడాల్సిందే. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ భాగంలో ఎమోషన్స్ బాగా పండాయి. చాలా చిన్న కథను జగపతిబాబు అద్భుతమైన నటన నిలబెట్టేసింది. అమలా పాల్ కూడా పోటీ పడింది. వీళ్లిద్దరి కోసమే దీని మీద లుక్ వేయొచ్చు

ఎపిసోడ్ 3 - ఎక్స్ లైఫ్

ప్రభాస్ తో త్వరలో వందల కోట్ల భారీ బడ్జెట్ ఫాంటసీ మూవీ తీయబోతున్న నాగ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిసోడ్ ఇది. మనుషులు మొబైల్, ఇంటర్నెట్ ను దాటేసి సరికొత్త వర్చువల్ ప్రపంచంలోకి వెళ్లేలా ఎక్స్ లైఫ్ అనే ఒక కొత్త టెక్నాలజీ కనిపెడతాడు విక్(సంజిత్ హెగ్డే). ప్రేమ లాంటి ఎమోషన్లను మనుషులకు దూరం చేసి ఓ వింత లోకాన్ని సృష్టిస్తాడు. అప్పుడు పరిచయమవుతుంది దివ్య(శృతి హాసన్). ఆమె వచ్చాక ఇతని జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ఎక్స్ లైఫ్ చివరికి ఏమైంది, జనం మళ్ళీ మాములుగా ఎలా అయ్యారు అనేదే కథ. తక్కువ నిడివి ఉన్నప్పటికీ చాలా సేపు అసలు అశ్విన్ ఏం చెప్పాలనుకుంటున్నాడో సాధారణ ప్రేక్షకులకు అర్థం కాదు. తారాగణం బాగానే చేసినప్పటికీ వీక్ రైటింగ్ అండ్ టేకింగ్ వల్ల నిరాశపరుస్తుంది

ఎపిసోడ్ 4 - పింకీ

ఘాజీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి తీసిన ఎపిసోడ్ ఇది. ప్రియాంక(ఈషా రెబ్బ)కు పెళ్ళై భర్త హర్ష(అవసరాల శ్రీనివాస్) ఉన్నా మాజీ భర్త రచయిత వివేక్(సత్య దేవ్)తో ఎఫైర్ ఉంటుంది. అతనికీ భార్య(ఆషిమా)వల్ల అసంతృప్తి ఉంటుంది. ఇదంతా పరస్పరం తమ పార్ట్ నర్స్ కి తెలియకుండా జాగ్రత్త పడతారు అయితే అనుకోకుండా ఈ రెండు జంటలు కలుసుకునే సందర్భం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది అక్కడే చూడాలి. లైన్ బాగానే ఉన్నప్పటికీ ఇదంత ఆసక్తికరంగా జరగదు. డల్ గా సాగుతుంది. కేవలం నాలుగు పాత్రల చుట్టే తిరగడంతో 35 నిమిషాల నిడివి కూడా సోసోగా నడుస్తుంది.

ఆల్ ఇన్ వన్ కంక్లూజన్

సౌత్ నుంచి వస్తున్న ఈ యాంథాలజిలు చూస్తుంటే నెట్ ఫ్లిక్స్ కేవలం దర్శకుల బ్యాక్ గ్రౌండ్, ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని కథ కథనాలను లైట్ గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కాసిన్ని బోల్డ్ సీన్లు, సంభాషణల్లో తగినన్ని బూతులు ఉంటే చాలు సహజత్వం పేరుతో ఏదైనా ఒప్పుకునేలా ఉన్నారు. అందులోనూ క్రాస్ కనెక్షన్స్ ఖచ్చితంగా ఉండాలని చెబుతున్నట్టు ఉంది. దానికి తగ్గట్టే కథలూ రాస్తున్నారు తీస్తున్నారు. వీటిని గొప్ప ప్రయత్నం అనలేం కానీ ఓటిటి కంటెంట్ కోణంలో చూసినా జస్ట్ యావరేజ్ ప్రయత్నమే అనిపిస్తుంది తప్ప అంతకు మించి ఎలాంటి ఫీలింగ్ కలగదు. కేవలం ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు తప్ప బడ్జెట్ పరంగా పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేని ఇలాంటి సిరీస్ లు ముందు ముందు చాలా వచ్చేలా కనిపిస్తున్నాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp