డ్యాన్స్ మాస్టర్ తో పవన్ సినిమా ?

వకీల్ సాబ్ కాకుండా ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా మరో సబ్జెక్టుకు ఓకే చేసేలా సూచనలు ఉన్నాయని తాజా అప్ డేట్. డాన్స్ మాస్టర్ జానీ చెప్పిన ఒక స్టోరీ లైన్ ఇంటరెస్టింగ్ గా అనిపించడంతో ఫైనల్ వెర్షన్ చేసుకుని రమ్మని అప్పుడు డిసైడ్ చేద్దామని చెప్పి పంపించినట్టు ఫిలింనగర్ టాక్. ఒకపక్క జనసేన కార్యకలాపాలు చేస్తూనే పవన్ ఇలా కథల మీద కథలు వింటూ అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇటు సినీ వర్గాలకు అటు రాజకీయ శ్రేణులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడున్న బిజీ స్టార్లు ఎవరూ ఇన్నేసి సినిమాలను క్యూలో పెట్టలేదన్న మాట వాస్తవం. ఒక్క పవన్ మాత్రమే ఇలా చేయడం షాకే.
నృత్య దర్శకులు డైరెక్టర్లు కావడం కొత్తేమి కాదు. గతంలో అమ్మ రాజశేఖర్ చాలా ఏళ్ళ క్రితం గోపిచంద్ తో రణం తీసి మంచి హిట్టు కొట్టాడు. ఆ తర్వాత ఏవో చవకబారు సినిమాలతో తన ఫామ్ కోల్పోవడం వేరే విషయం. ప్రభుదేవా ఇప్పటికీ మంచి మార్కెట్ తో కొనసాగుతున్నాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో మొదలుకుని ఇప్పటి సల్మాన్ ఖాన్ రాధే దాకా దర్శకుడిగానూ కెరీర్ ని బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. ఇలా వీళ్ళ నుంచి స్ఫూర్తి పొందాడేమో కాబోలు జానీ మాస్టర్ కూడా ఏకంగా పవన్ కళ్యాణ్ కే గేలం వేయడం విశేషం. మెగా ఫ్యామిలీతో ముందు నుంచి తనకు మంచి ర్యాపొ ఉంది.
పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ పూర్తి చూశాక అయ్యప్పనుం కోషియం రీమేక్ లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న హిస్టారికల్ ప్రాజెక్ట్ కంటిన్యూ చేయాలి. ఆపై హరీష్ శంకర్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు సురేందర్ రెడ్డికి ఒక కమిట్ మెంట్ పెండింగ్ ఉంది. వీళ్ళ సరసన ఇప్పుడు జానీ మాస్టర్ వచ్చి చేరబోతున్నాడా అంటే వేచి చూడాలంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఎలా చూసుకున్నా వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల కావడం దాదాపు పక్కానే. 2022లో కూడా అదే ఛాన్స్ ఉంది. సో రాబోయే సంవత్సరాలలో పవన్ ఫ్యాన్స్ కు మాములు పండగా ఉండబోవడం లేదు.


Click Here and join us to get our latest updates through WhatsApp