తగ్గుతున్న OTT రేట్లు - నిర్మాతల అగచాట్లు

By iDream Post Sep. 27, 2020, 03:13 pm IST
తగ్గుతున్న OTT రేట్లు - నిర్మాతల అగచాట్లు

కొత్తొక వింత అనే సామెత ఊరికే పుట్టుకురాలేదు. ఇప్పుడు ఓటిటి పరిస్థితి చూస్తే దానికి సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. లాక్ డౌన్ టైంలో థియేటర్లు మూతబడి జనం ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లలోనే ఉండాల్సి వచ్చినప్పుడు సరికొత్త వినోద ప్రత్యాన్మయంగా వాళ్లకు ఓటిటి కనిపించింది. సీరియల్స్ ఆగిపోవడం, వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ టీవీలో వేస్తుండటంతో సహజంగానే వీటికి చందాదారుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. అందుకే భారీ ఆఫర్లతో కోట్ల రూపాయలు వెచ్చించి హక్కులు కొనేందుకు సిద్ధ పడ్డాయి సదరు డిజిటల్ సంస్థలు. కొన్నింటికి పెట్టుబడికి డబుల్ ఇస్తామన్న ఉదంతాలు కూడా ఉన్నాయి. దిల్ రాజు ఆ రకంగానే వి విషయంలో చాలా సేఫ్ అయ్యారు.

కానీ పరిస్థితి ఇప్పుడలా లేదు. ఒక్క థియేటర్లు తెరవలేదనే మాటే తప్ప మిగిలిన జన జీవనం సర్వసాధారణం అయిపోయింది. ఎవరి పనుల్లో ఎవరి వృత్తుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఎప్పటిలాగే సీరియల్స్ మొదలైపోయాయి. కొత్తవి కూడా స్టార్ట్ చేశారు. సహజంగా ముందున్నంత స్పీడ్ ఇప్పుడు ఓటిటిలో లేదు. మే నుంచి జులై మధ్య మతులు పొతే రేట్లు ఆఫర్ చేసిన యాప్స్ మెల్లగా మాట మారుస్తున్నాయి. తెలుగులోనూ ఇలాంటి ధోరణి కనిపిస్తోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న ఓ యూత్ హీరో సినిమాకు మూడు నెలల ముందు వచ్చిన ప్రతిపాదన కన్నా ఇప్పుడు తక్కువ మొత్తానికే రాజీ పడాల్సి వచ్చిందట. ఆఫర్ వచ్చినప్పుడు బెట్టు చేస్తే తర్వాత ఇలాగే మెట్టు దిగాల్సి వస్తుంది. టీవీ యాంకర్ నటించిన మరో సినిమాకు అప్పుడు ఆరు కోట్ల దాకా ఇస్తామన్న వాళ్ళు ఇప్పుడు నాలుగు లోపలైతేనే చెప్పండి అంటూ డిజిటల్ సంస్థలు బేరాలు పెడుతున్నాయట.

వెంటపడినప్పుడు వద్దన్నందుకు ఇప్పుడు మాకూ వద్దు అని దెబ్బకు దెబ్బ సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ కంటే ఎక్కువగా తమిళంలో పదికి పైగా సినిమాలు ఇలా త్రిశంకు స్వర్గంలో ఉంటూ బాధలు పడుతున్నాయి. ముందే ఇచ్చేసి ఉంటే కోట్లు మిగిలేవి కదా అంటూ లబోదిబోమంటున్నాయి. ఇప్పుడిక ఛాన్స్ లేదు. తక్కువైనా సరే మీడియం రేంజ్ చిత్రాలు ఇచ్చేసుకోక తప్పదు. స్టార్ హీరోల సినిమాలు ఎన్ని రోజులు ఆగినా నష్టమేమి లేదు. కానీ మిగిలిన వాటికి అలా కుదరదు. అసలు హాళ్లు తెరిచాక జనం ఎంత శాతంలో వస్తారో ఎవరికీ అంతుచిక్కని అయోమయంలో ఇప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడమనే సామెతకు అర్థం ఇప్పుడు తెలిసొస్తోందని కొందరు ప్రొడ్యూసర్లు ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికైతే ఓటిటి రంగానికి సంబంధించి మునుపటి దూకుడు కనిపించడం లేదు. రాబోయే నెలల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp