అవకాశం ఉన్నది ఒక్క సినిమాకే

By iDream Post Apr. 17, 2021, 03:00 pm IST
అవకాశం ఉన్నది ఒక్క సినిమాకే
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడటం చిన్న సినిమాలకు విపరీతంగా కలిసి వస్తోంది. ఉహించని విధంగా మంచి రిలీజ్ డేట్లు దొరుకుతున్నాయి. అయితే వాటిని వాడుకుంటున్న దాఖలాలు మాత్రం పెద్దగా కనిపించడం లేదు. నిన్న పరిస్థితి చూస్తే అయిదు చిత్రాలు వచ్చాయి. దేనికీ మినిమమ్ టాక్ లేదు. థియేటర్లు చాలా చోట్ల ఖాళీగా దర్శనమిచ్చాయి. వర్మ దెయ్యం, రెహమాన్ 99 సాంగ్స్ కనీస ఓపెనింగ్స్ ని రాబట్టుకోలేకపోయాయి. ఇంకో మూడు సినిమాల గురించి మాట్లాడుకోకపోవడం బెటర్. ఉన్నంతలో వకీల్ సాబ్ హవానే జోరుగా సాగుతోంది. డ్రాప్ ఉన్నా కూడా డీసెంట్ నెంబర్స్ వస్తున్నాయి.

ఇదే తరహాలో వచ్చే శుక్రవారం 23వ తేదీ కూడా క్యూ ఉంది. కథానిక, శుక్ర, తెలంగాణ దేవుడు, రేడియో మాధవ్ అని ఏవేవో వస్తున్నాయి. కనీసం వీటిలో హీరోలు ఎవరో కూడా పబ్లిక్ కి తెలియనంత వీక్ గా ప్రమోషన్లు జరుగుతున్నాయి. ఉన్నంతలో తేజ సజ్జ ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ కొంత అటెన్షన్ తెచ్చుకుంటోంది. కానీ దీనికి సైతం డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు తక్కువే. కాకపోతే టాక్ కనక పాజిటివ్ వస్తే మాత్రం ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. పెట్టిన బడ్జెట్ ని ఈజీగా వెనక్కు రాబట్టుకోవచ్చు. కన్నుగీటు సుందరి ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించడం కొంత ప్లస్ అవుతోంది కానీ తనేమీ ఇప్పుడు క్రౌడ్ పుల్లర్ కాదు.

పెద్ద నిర్మాణ సంస్థ అండగా ఉండటంతో ఇష్క్ కు మంచి రిలీజ్ దక్కుతుంది. చెప్పుకోదగ్గ సంఖ్యలో స్క్రీన్లు దొరుకుతాయి. అయితే వాటిని నిలబెట్టుకునే కంటెంట్ ఇందులో ఉండాలి మరి. 2019లో మలయాళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇష్క్ రీమేక్ అని టాక్ ఉంది కానీ మేకర్స్ ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకురావడం లేదు. ఓ రాత్రి పూట ప్రేమ జంటకు ఎదురయ్యే ఊహించని పరిణామాల నేపథ్యంలో ఇష్క్ కథ సాగుతుంది. అక్కడ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మరి ఇక్కడి ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు ఎలాంటి మార్పులు చేశారనేది కీలకంగా మారనుంది. జాంబీరెడ్డి హిట్టయినా తేజకు ఇంకా ఇమేజ్ ఏర్పడలేదు. మరి ఇష్క్ అయినా తెస్తుందేమో చూడాలి.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp