ఖరీదైన పాఠానికి తొలి ఏడాది

By iDream Post Aug. 30, 2020, 01:36 pm IST
ఖరీదైన పాఠానికి తొలి ఏడాది

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఆగస్ట్ 30న తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశమంతా ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూసింది. బాహుబలితో జాతీయ స్థాయి దాటి చైనా, జపాన్ లాంటి దేశాల్లోనూ మ్యాచో మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కొత్త సినిమా సాహో విడుదలైంది. అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. టికెట్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. రికమండేషన్లు పెడితే కానీ దొరకని పరిస్థితి. ఏ ఊరిలో చూసిన సగం పైగా థియేటర్లలో సాహో మూవీనే. వేరే ఆప్షన్ లేదు. బాలీవుడ్ లోనూ దీని ఫలితం మీద విపరీతమైన ఆసక్తి. ట్రైలర్ చూశాక షారుఖ్ ఖాన్ అంతటివాడే దర్శకుడు సుజిత్ ని విడుదలయ్యాక కలవమని చెప్పి పంపించాడు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా, ముంబై నుంచి మదనపల్లి దాకా ఎక్కడ చూసినా విపరీతమైన రద్దీ. ప్రీమియర్ షోలు కిక్కిరిసిపోతున్నాయి.

అభిమానులే కాదు సామాన్య ప్రేక్షకులూ మొదటి రోజు చూడకపోతే ఏదో మిస్ అవుతామన్న ఆతృతలో లీవులు పెట్టుకుని మరీ సిద్ధపడిపోయారు. డార్లింగ్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి సాహో ఓపెనింగ్స్ గొప్ప ఉదాహరణగా నిలిచాయి. బాహుబలి ఫాంటసీ చిత్రం కాబట్టి ఆడిందన్న పాయింట్ ని పటాపంచలు చేస్తూ సాహో లాంటి కమర్షియల్ మూవీకి ఇంత రెస్పాన్స్ ఎవరూ ఊహించనిది. మూడు వందల కోట్ల దాకా బడ్జెట్, అడుగడుగునా అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్. తెరనిండా భారీ తారాగణం, కళ్ళు చెదిరిపోయే విజువల్స్, శ్రద్ధా కపూర్ అందచందాలు, ఇది కలా నిజమా అనిపించేలా ఎన్నడూ చూడని సెట్టింగులు, హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో మేకింగ్. సుజిత్ కు ఇది రెండో సినిమానేనా అనిపించేలా అదిరిపోయే లెవెల్ లో సెటప్. అంతా బాగానే ఉంది కానీ అసలైన కథాకథనాల్లో విషయం తగ్గింది . భారీతనం ఉంటే చాలు హీరో ఇమేజ్ మీద సినిమా ఆడేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి అనే లెక్కలను నిలువునా పాతరేస్తూ బెనిఫిట్ షో కాగానే నెగటివ్ టాక్ బయటికి వచ్చేసింది. తాము ఊహించిన సాహో ఇది కాదంటూ అభిమానులే నిట్టూర్చారు. పాటలు ఆకట్టుకోలేదు.

ఫైట్లు అత్యద్భుతంగా ఉన్నా పాత్రలకు ప్రేక్షకులకు మధ్య ఉండాల్సిన ఎమోషన్ ఎక్కడా పండలేదు. తెరమీద అంత ఖర్చు కనిపిస్తున్నా అది ఆస్వాదించలేని పరిస్థితి. ఉప్పు వేయకుండా ఎంత ఘనంగా వంట చేసినా దాని రుచిని అనుభవించలేం. సాహోలో జరిగింది అదే. రెండు ముప్పావు గంటలను ఓపిగ్గా భరించడం ఆడియన్స్ వల్ల కాలేదు. ఫలితంగా మితిమీరిన అంచనాలలో సగం కూడా అందుకోలేక సాహో నిరాశాజనకమైన ఫలితాన్ని ఇచ్చింది. హైప్ వల్ల నష్టాలు కొంతమేర తగ్గాయి కానీ లేదంటే ఇంకా దారుణంగా ఉండేది. మసాలా సినిమాల కరువులో నార్త్ ప్రేక్షకులు సాహోని బాగానే రిసీవ్ చేసుకున్నారు. అయితే అసలు బాషలో మాత్రం పరాభవం తప్పలేదు. సాహో నేర్పించిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేనిది. వందల కోట్ల బడ్జెట్, అన్ని బాషల నుంచి తీసుకున్న కాస్ట్లీ క్యాస్టింగ్, ఎన్నడూ చూడని సెట్లు, విజువల్స్ ఇవి ఉంటే సరిపోదు. వీటి కన్నా ఎక్కువగా ప్రేక్షకులను కట్టిపడేసే కంటెంట్ కావాలి. దాన్నే కథాకథనాలు అంటారు. అవి మర్చిపోకుండా తీసే ఏ సినిమాకైనా ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. లేదంటే ఇలాంటి లెసన్స్ మళ్ళీ మళ్ళీ నేర్పిస్తారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp