థియేటర్ ముద్దు - ఓటిటి వద్దు

By iDream Post Jun. 07, 2021, 12:00 pm IST
థియేటర్ ముద్దు - ఓటిటి వద్దు
కరోనా సెకండ్ వేవ్ మెల్లగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఇండస్ట్రీలో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. రేపో ఎల్లుండో అధిక శాతం ఆంక్షలను సడలిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలోనే సగం జిల్లాలో థియేటర్లకు కూడా అనుమతులు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి రాబోయే రోజుల్లో పెద్దగా డైరెక్ట్ డిజిటల్ రిలీజులు ఉండకపోవచ్చు. ఇప్పటిదాకా వచ్చినవాటిలో పెద్ద హైప్ ఉన్నవి కానీ స్టార్లు నటించినవి కానీ ఏవీ లేవు. దాంతో గత ఏడాది కనిపించినంత ఓటిటి దూకుడు ఈ సంవత్సరం లేదన్నది కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.

ప్రస్తుతానికి సగం సీట్లతోనే అనుమతులు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయినా పర్లేదు సంక్రాంతికి ప్రేక్షకులు ఇచ్చిన భరోసా ఎలాగూ ఉంది కదా. దాన్నే నమ్ముకుని మీడియం రేంజ్ నిర్మాతలు తమ రిలీజులను వచ్చే నెల నుంచి ప్లాన్ చేసుకునేలా కనిపిస్తున్నారు. గతంలో పాగల్, గుడ్ లక్ సఖి, రిపబ్లిక్,ఇష్క్ లాంటివి ఓటిటిలో రావొచ్చని ప్రచారం జోరుగా జరిగింది. ఒకరిద్దరు వీటిని ఓపెన్ గానే ఖండించారు కూడా. అయితే మారుతున్న వాతావరణంకు అనుగుణంగా ఇప్పుడు నిర్ణయాల్లో మార్పులు రాబోతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేశాక  ఓ పది రోజుల తర్వాత అనౌన్స్ మెంట్లు క్యూ కట్టే ఛాన్స్ లేకపోలేదు.

ఇలా జరగడానికి కారణం లేకపోలేదు. ఓటిటిలు తెలివిమీరిపోయాయి. గతంలోలా డీల్స్ మాట్లాడ్డం లేదు. సవాలక్ష కండీషన్లు చెబుతున్నారు. దీంతో ఒళ్ళు మండిన నిర్మాతలు థియేటర్ వైపే మొగ్గు చూపుతున్నారు. సెకండ్ వేవ్ కు ముందు మూతబడిన థియేటర్లన్నీ తెరుచుకుంటాయో లేదో అనే టెన్షన్ డిస్ట్రిబ్యూటర్లలో లేకపోలేదు. ఇప్పటికే విసుగు చెందిన సింగల్ స్క్రీన్ ఓనర్లు కొందరు వాటిని కమర్షియల్ కాంప్లెక్సులుగా ఫంక్షన్ హాళ్లుగా మార్చే ఆలోచనలో ఉన్నారు. రేపు ఆల్ ఓపెన్ అన్న తర్వాత వీటికి సంబంధించిన క్లారిటీ వస్తుంది. మొత్తానికి థియేటర్ల మీద కరోనా ఫస్ట్ పార్ట్ అంత ప్రభావం సెకండ్ పార్ట్ చూపించకపోవడం అదృష్టం
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp