'నిశ్శబ్దం' బద్దలవుతోంది : విడుదల తేది

By iDream Post Sep. 18, 2020, 01:43 pm IST
'నిశ్శబ్దం' బద్దలవుతోంది : విడుదల తేది

గత మూడు నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఊరిస్తూ వచ్చిన అనుష్క నిశ్శబ్దం ఎట్టకేలకు ఓటిటి రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసుకుంది. అక్టోబర్ 2న తెలుగు తమిళంతో పాటు మలయాళంలో డబ్బింగ్ వెర్షన్ ని ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నాని వి తర్వాత అతి పెద్ద స్టార్ మూవీ ఇదే అని చెప్పాలి. అన్నింటి కంటే ముందు వార్తల్లో ఉంటూ వచ్చిన నిశ్శబ్దం ఒకరకంగా కొంత ఆలస్యంగానే వస్తోంది. అమెజాన్ ప్రైమ్ తో డీల్ విషయంలో జాప్యం జరిగిందని అందుకే లేట్ కాక తప్పలేదని ఇన్ సైడ్ టాక్. హారర్ కం సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో అనుష్క మాటలు రాని చిత్రకారిణిగా ఒక డిఫరెంట్ రోల్ చేస్తోంది.

సవ్యసాచి తర్వాత గ్యాప్ తీసుకున్న మాధవన్ ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అంజలి, సుబ్బరాజు, షాలిని పాండే తదితరులు ఇందులో భాగమయ్యారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భాగమతి తర్వాత సైరాలో చిన్న క్యామియో చేసిన అనుష్క ఈ రెండేళ్లు పూర్తిగా ఈ ఒక్క సినిమా కోసమే కేటాయించింది. దీన్ని బట్టి ఇందులో ఏదో బలమైన కంటెంట్ ఉందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అసలే లాక్ డౌన్ కాలం. ఒకవేళ థియేటర్లు తెరిచినా టార్గెట్ ఆడియన్స్ పరిమితంగా ఉండే ఇలాంటి జానర్ మూవీస్ కి భారీ వసూళ్లు ఆశించడం కష్టం. అందుకే నిశ్శబ్దం డిజిటల్ రిలీజ్ మంచి నిర్ణయమని చెప్పొచ్చు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గిరీష్ గోపాలకృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

హై ఇంటెన్సిటీ థ్రిల్లర్ గా రూపొందిన నిశ్శబ్దం అయినా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటుందేమో చూడాలి. ప్రైమ్ కాబట్టి చందాదారుల సంఖ్య దృష్ట్యా భారీ వ్యూస్ నమోదు కావడం ఖాయం. కోన వెంకట్ టిజి విశ్వప్రసాద్ నిశ్శబ్దంకు నిర్మాతలుగా వ్యవహరించారు. థియేటర్లలో అయితే ఫలానా మొదటి రోజు ఇంత కలెక్షన్ వచ్చిందని చెప్పుకునే అవకాశం ఉండేది కానీ ఓటిటి సంస్థలు గోప్యత పాటిస్తుండటంతో ఎన్ని కోట్ల మంది చూశారు అనే లెక్కలు బయటికి రావడం లేదు. కేవలం సినిమా ఎలా ఉందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో, రివ్యూలు ఆన్ లైన్ లో కనిపిస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన నిశ్శబ్దం ఎలాంటి సంచలనాలు నమోదు చేయబోతోందో అక్టోబర్ 2న చూడాలి మరి. ఎలాగూ నేషనల్ హాలిడే కాబట్టి అది కూడా ప్లస్ కాబోతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp