శాటిలైట్ సినిమాలకు కొత్త సవాల్

By iDream Post Nov. 27, 2020, 03:55 pm IST
శాటిలైట్ సినిమాలకు కొత్త సవాల్

ఓటిటిలు లాక్ డౌన్ టైంలో థియేటర్ల వ్యవస్థను ఎంత ప్రభావితం చేశాయో చూస్తూనే ఉన్నాం. ప్రేక్షకులు ఇంట్లోనే నేరుగా కొత్త సినిమాలు రిలీజులు చూసేందుకు అలవాటు పడటంతో భవిష్యత్తులో పెద్ద హీరోలకు తప్ప బడ్జెట్ చిత్రాలకు మినిమమ్ ఓపెనింగ్స్ రావడం కూడా అనుమానంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడీ ప్రభావం నేరుగా శాటిలైట్ ఛానల్స్ మీద కూడా పడుతోంది. ఒకప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటే క్రేజ్ మాములుగా ఉండేది కాదు. 90వ దశకంలో షోలేని మొదటిసారి దూరదర్శన్ లో టెలికాస్ట్ చేసినప్పుడు చాలా ఊళ్ళల్లో కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొందంటే ఆశ్చర్యం కలగక మానదు.

శాటిలైట్ ఛానల్స్ వచ్చిన కొత్తలో కూడా ఈ ప్రభంజనం ఉదృతంగా ఉండేది. అడవిరాముడు, జగదేకేవీరుడు అతిలోకసుందరి, శివ లాంటి పాత సినిమాలు ప్రసారమైనప్పుడు జనం ఎగబడి చూసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టి హక్కులు కొనే ఛానళ్ళకు రాబడి రాను రాను గండంగా మారుతోంది. రేటింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇటీవల సాహొ, బీష్మల వరల్డ్ ప్రీమియర్లకు ఎంత తక్కువ రేటింగ్ వచ్చిందో చూసాం. అల వైకుంఠపురములో సెకండ్ టైం టెలికాస్ట్ కనీసం 10 రేటింగ్ కూడా తెచ్చుకోలేకపోయింది. ఇదంతా విశ్లేషించుకోవాల్సిన పరిణామమే.

యాడ్స్ లేకుండా కోరుకున్న టైంలో ఓటిటిలో కొత్త సినిమాలు చూసే వీలున్నప్పుడు పండగ రోజో పనున్న టైంలోనో టీవీలో వచ్చినప్పుడు అవి చూసేంత తీరిక ఓపిక అధిక శాతం ప్రేక్షకులకు ఉండటం లేదు. ఈ కారణం వల్లే మొదటిసారి టిఆర్పి బాగానే వస్తున్నా ఆ తర్వాత దారుణంగా పడిపోతున్నాయి. నిర్మాతలు సైతం హక్కులు అమ్మే టైంలో ఓటిటి సంస్థల ఆఫర్లకే మొగ్గు చూపుతున్నారు. సదరు డిజిటల్ కంపెనీల నిబంధనల వల్ల కూడా టెలికాస్ట్ లేట్ చేయాల్సిన సందర్భాలు కూడా వస్తున్నాయి. చూస్తుంటే పరిస్థితి ఇంకా కిందకు వెళ్లడం తప్ప మెరుగుపడేలా కనిపించడం లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp