పిట్టకథలతో నెట్ ఫ్లిక్స్ తెలుగు ఎంట్రీ

By iDream Post Jan. 20, 2021, 11:41 am IST
పిట్టకథలతో నెట్ ఫ్లిక్స్ తెలుగు ఎంట్రీ

అంతర్జాతీయంగా ఓటిటిలో టాప్ చైర్ ని ఎంజాయ్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ ఇప్పుడిప్పుడే రీజనల్ కంటెంట్ మీద దృష్టి పెడుతోంది. ఆ మధ్య తమిళంలో చేసిన పావ కథైగల్ కు మంచి పేరే వచ్చింది. ప్రకాష్ రాజ్, సాయి పల్లవి లాంటి లీడింగ్ యాక్టర్స్ తో పాటు వెట్రి మారన్ లాంటి అగ్ర దర్శకులు దానికి పని చేయడంతో ఆడియన్స్ రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ తెలుగులోనూ నెట్ ఫ్లిక్స్ అడుగు పెట్టనుంది. ఈ మేరకు ఇందాక అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. పిట్టకథలు పేరుతో తెలుగు డైరెక్ట్ ఒరిజినల్ ఫిలిం ని ఫిబ్రవరి 19న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇకపై పోటీ రసవత్తరంగా మారనుంది.

పిట్టకథలు కూడా ఆషామాషీగా కనిపించడం లేదు. తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, నాగ అశ్విన్ వీళ్ళు నలుగురు ఒక్కో ఎపిసోడ్ ని డైరెక్ట్ చేయగా అన్నీ కలిపి ఒకే సిరీస్ గా ఇది ప్రేక్షకులను పలకరించనుంది. కీలక పాత్రల్లో శృతి హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బ, మంచు లక్ష్మి నటించగా జగపతి బాబు లాంటి స్టార్ సీనియర్లు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. ఇతర క్యారెక్టర్లలో అశ్విన్ కాకుమాను, సాన్వే మేఘన, సంజిత్ హెగ్డే తదితరులు ఉన్నారు. ఒకే సమస్య మీద పోరాడే నలుగురు మహిళల జీవితాలను ఇందులో చూపించబోతున్నారు. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయి.

2019లో వచ్చిన లస్ట్ స్టోరీస్ కి రీమేక్ గా దీని గురించి ప్రచారం జరిగింది కానీ అదెంత వరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది. ట్రైలర్ చూస్తే కొన్ని పోలికలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా చెప్పలేం. మొత్తానికి ఒరిజినల్ తెలుగు కంటెంట్ ట్యాగ్ తో ప్రమోషన్ మొదలుపెట్టిన నెట్ ఫ్లిక్స్ కొత్త గేమ్ ని స్టార్ట్ చేసింది. ఇందాకా ఆహా కూడా తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. ఓన్లీ తెలుగు కంటెంట్ తో ఆల్రెడీ మేమున్నా కూడా అరుస్తున్నామా అంటూ జులాయి స్టైల్ లో మెసేజ్ పెట్టింది. ఏది ఏమైనా థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఓటిటి రంగం దూకుడు తగ్గించేందుకు సిద్ధంగా లేదన్న క్లారిటీ అయితే వచ్చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp